విజ్ఞానశాస్త్రంలో శక్తినిత్వత్వ నియమం ఈ ప్రకృతిలో ‘‘శక్తిని సృష్టించలేము మరియు శక్తిని నశింపజేయలేము.’’ అని చెబుతుంది. ప్రకృతిలో ఉన్న శక్తినే పొదుపుగా వాడాలని దీనర్థం. మనం నివసించే ఈ నేల మీద శక్తిని కేవలం రెండే రెండు మార్గాల ద్వారా పొందగలం. అందులో ఒకటి పరిమితంగా లభించే శిలాజ ఇంధనాలయిన బొగ్గు, పెట్రోలు లాంటి పునరుత్పాదకత చేయలేనివి, రెండోది అపరిమితంగా లభించే నీరు, వేడి గాలి లాంటి పునరుత్పాదకత వనరులు. ఇటువంటి పరిస్థితులలో పునరుత్పాదక చేయలేని వనరుల వినియోగం తగ్గించి పునరుత్పాదక వనరుల నుండి శక్తికి మరలడమే మన ముందున్న మార్గం. జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం: జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని (నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ) ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవ ప్రాధమిక ఉద్దేశ్యం శక్తి వినియోగాన్ని తగ్గించి దానిని మరింత సమర్థవంతంగా ఉపయోగించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఇంధనపొదుపు, సమర్థవంతమైన ఇంధనవినియోగం, శక్తి వృథాను తగ్గించడానికి స్థిరమైన పద్ధతులను అవలంబించే ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. ఈ ఏడాది థీమ్ ‘‘ ప్రతీ వాట్ ని లెక్కించి శక్తిలో స్థిరత్వం సాధించాలి.’’ శక్తిని పొదుపు చేయడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉందని ఈ థీమ్ మనకు గుర్తు చేస్తుంది.
మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు: భారతదేశం ప్రపంచం లోనే మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారని స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2024 నివేదిక తెలియజేసింది. దీనికి కారణం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రవాణా అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఆదాయంతో మెరుగైన జీవన ప్రమాణాలు మొదలైనవి. ఆధునిక శక్తికి పెరిగిన ప్రాప్యతతో పాటు ప్రైవేట్ వినియోగం పెరగడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా దేశ ఇంధన వినియోగం నిరంతరం పెరుగుతోంది. పునరుత్పాదక శక్తిలో మనదేశం: పునరుత్పాదక శక్తి 2024లో మొత్తం 120 దేశాలలో మనదేశం 63వ స్థానంలో ఉంది. గత ఏడాది 67వ స్థానంలో ఉండేది. ఇది మునుపటి స్థానం నుండి మెరుగుదలను సూచిస్తుంది. దేశంలో మొత్తం స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక వాటా 43.12%గా ఉంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మనదేశం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది.
పునరుత్పాదక ఇంధన ప్రయాణం: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మన దేశంలో మొత్తం పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే 24.2 గిగావాట్లు (13.5%) పెరిగింది. ఇది 2023 అక్టోబర్లో 178.98 గిగావాట్ల నుండి 2024 అక్టోబర్లో 203.18 గిగావాట్లకు చేరుకుంది. అదనంగా అణుశక్తిని కలుపుకుంటే మొత్తం శిలాజేతర ఇంధన సామర్థ్యం 2023 లో 186.46 గిగావాట్ల నుండి 2024 లో 211.36 గిగావాట్లకు పెరిగింది. ఇది దేశం యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యంలో 46.3 శాతానికి పైగా ఉంది. పునరుత్పాదక ఇంధన వనరులలో 92.12 గిగావాట్ల సామర్థ్యంతో సౌరశక్తి అగ్రగామిగా ఉంది. 47.72 గిగావాట్ల సామర్థ్యంతో పవనశక్తి మరొక ప్రధాన సహకారి. జలవిద్యుత్ కూడా కీలకమైన మూలం. పెద్ద హైడ్రో ప్రాజెక్ట్‌లు 46.93 గిగావాట్లు, చిన్న జలవిద్యుత్ 5.07 గిగావాట్లని ఉత్పత్తి చేశాయి. బయోమాస్, బయోగ్యాస్ ఎనర్జీతో సహా బయోపవర్ పునరుత్పాదక ఇంధన మిశ్రమానికి మరో 11.32 గిగావాట్లను జోడిస్తుంది. ఈ ఏడాది నవంబర్ 13 వ తేదీ నాటికి 29.98 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 29.52 గిగావాట్ల సామర్థ్యం కలిగిన గుజరాత్ సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తమిళనాడు 23.70 గిగావాట్లతో మూడవ స్థానంలో ఉంది. 22.37 గిగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ మిశ్రమ సహకారంతో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచింది. భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ భడ్లా సోలార్ పార్క్ జోధ్‌పూర్ (రాజస్థాన్)లో 56.6 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయ వ్యర్థాలు, ఇతర సేంద్రీయ పదార్థాల నుండి విద్యుదుత్పత్తి చేయడానికి ఈ బయోఎనర్జీ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. ఈ పునరుత్పాదక వనరులు సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశానికి సహాయ పడుతున్నాయి. ఈ అద్భుతమైన వృద్ధి 2030 నాటికి శిలాజేతర వనరుల నుండి 500 గిగావాట్ సాధించాలనే దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి: తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యంతో 500 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న, స్థూల పరిశ్రమలు, వ్యవసాయ నివాస భూముల కోసం సోలార్‌ను కూడా ప్రారంభిస్తోంది. రాబోయే ఐదేళ్లలో ప్రస్తుత ఉత్పత్తికి 3 గిగావాట్ క్లీన్ ఎనర్జీని జోడిరచాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ క్రమంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారుతోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం 5000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణపరంగా స్థిరమైన పద్ధతిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి యుటిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సోలార్ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం యోచిస్తోంది.
భారత దేశ నిబద్ధత: గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో పేర్కొన్న ఐదు అంశాలను చేర్చి పారిస్ ఒప్పందం కింద దాని మెరుగైన జాతీయంగా నిర్ణయించిన విరాళాలు (ఎన్డిసి) లో వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భారతదేశం యొక్క నిబద్ధత ప్రతిబింబిస్తుంది. ఆగస్టు 2022 లో యుఎన్‌ఎఫ్సిసిసి (యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్) కు సమర్పించిన నవీకరించబడిన ఎన్డిసిలో భాగంగా భారతదేశం తన ఉద్గారాల తీవ్రతను 2030 నాటికి (2005 స్థాయిలతో పోలిస్తే) 45% తగ్గించడానికి, 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుండి సంచిత విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని 50% సాధించడానికి ‘లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి) ద్వారా స్థిరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. 2022 నవంబరులో యుఎన్‌ఎఫ్సిసిసికి సమర్పించిన ‘దీర్ఘకాలిక తక్కువ కార్బన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ’ మద్దతుతో 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యానికి కూడా ఈ లక్ష్యాలు దోహదం చేస్తాయి. వాడకం తగ్గించుకోవాలి: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటే మనం పొదుపు చేసినట్లే. దీనికి గాను గృహాలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎల్‌ఇడి బల్బులను వాడాలి. ఫ్యాన్లను అవసరం లేనప్పుడు ఆపివేయాలి. ఎయిర్ కండిషన్ వాడకాన్ని తగ్గించాలి. వేడి నీరు కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవాలి. ఇండ్లు, ఆఫీసులలో ఆధునిక వైరింగ్ చేయించుకోవాలి. వ్యవసాయంలో సోలార్ పంపులను వినియోగించాలి. ప్రతీ ఒక్కరూ విద్యుచ్ఛక్తిని ఆదా చేసినప్పుడు మాత్రమే భవిష్యత్ తరానికి వెలుగునిచ్చే వారవుతాం.
-జనక మోహన రావు దుంగ
యం.యస్సీ (ఫిజిక్స్ )
8247045230





