-డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: మూసీ పునర్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు.. తమ ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండిరగ్ పవర్ బిల్లుల వన్ టైం సెటిల్‌మెంట్ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. ప్రభుత్వం- పరిశ్రమలు – పౌర సమాజం అంతా కలిసి పనిచేద్దాం.. హైదరాబాదులో సృష్టించే సంపదను రాష్ట్రంలోని ప్రతి ఇంటకీ తీసుకెళ్దాం అన్నారు. సంపద సృష్టించడం ఒక సాధన మాత్రమేనని, మన ప్రజల గౌరవాన్ని పెంపొందిస్తూ వారి ఆశయాలను నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌సీసీఐ)కి వందేళ్ల పైగా అనుభవం ఉంది. హైదరాబాద్ నగరం ఒక వర్తక నగరం నుంచి ప్రపంచస్థాయి నగరంగా ఎదిగే వరకు ప్రతి దశలోనూ ఎఫ్‌సీసీఐ ముందు నడిచిందని భట్టి కొనియడారు.



