– విదేశాల నుంచి ఎన్నారైల డబ్బు బదిలీలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: రూపాయి ధర పడిపోవడంతో గల్ఫ్ నుంచి ఎన్నారైలు స్వదేశానికి భారీగా డబ్బులు పంపిస్తున్నారు. ఒక దిర్హమ్తో పోలిస్తే భారత కరెన్సీ విలువ ప్రస్తుతం 24.5 రూపాయలుగా ఉంది. కొన్ని రోజులుగా అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోన్న నేపథ్యంలో దిర్హమ్లను మార్చుకున్నప్పుడు తమకు సాధారణం కంటే ఎక్కువ ఇండియన్ కరెన్సీ లభిస్తుందని యూఏఈలో నివసిస్తోన్న భారతీయులు చెబుతున్నారని ఓ మీడియా కథనం పేర్కొంది. దీంతో అక్కడ పనిచేస్తున్న భారతీయలు తమ దేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు బదలాయింపు చేస్తున్నారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశం యూఏఈ నుంచి నగదు ప్రవాహం భారీగా పెరిగింది. రూపాయి పతనం వేళ అక్కడ ఉన్న భారతీయుల నుంచి రెమిటెన్స్‌లు మూడు రెట్లు పెరిగినట్లు ఖలీజ్ టైమ్స్ కథనం వెల్లడించింది. యూఏఈ దిర్హమ్తో పోలిస్తే రూపాయి పడిపోతుండటంతో స్వదేశానికి డబ్బు పంపించడానికి ఇదే సరైన సమయమని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారని పేర్కొంది. దాంతో ఈ అవకాశాన్ని వదులుకో కూడదని భావిస్తున్న భారతీయులు కొందరు ఎక్కువ మొత్తంలో నగదును స్వదేశానికి పంపిస్తున్నారని వెల్లడించింది. ఇదిలావుండగా.. భారత్-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ నానాటికీ క్షీణిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో ఒక దశలో మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయి 90.43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్షీణత మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, రూపాయి విలువ 90.70-91 మార్క్‌ను తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలలుగా భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో, డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండటం రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





