– 5364 ఇందిరమ్మ ఇళ్లకు రూ. 53.64 కోట్లు చెల్లింపు
– ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్
– మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా పనులు పూర్తయిన మేరకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేస్ మెంట్ పూర్తిచేసుకున్న 1383 ఇళ్లకు , గోడలు పూర్తియిన 224 ఇండ్లకు సోమవారం నాడు రూ.16.07 కోట్లు విడుదల చేశామన్నారు. మొత్తంగా ఇప్పటివరకు బేస్ మెంట్, గోడలు పూర్తిచేసుకున్న 5, 364 లబ్దిదారులకు రూ. 53.64 కోట్లు చెల్లించామన్నారు.సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్దిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పధకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని ఇందులో 5140 ఇళ్లు బేస్‌మెంట్, 300 ఇళ్లు గోడల నిర్మాణం వరకు మరో పది ఇళ్లు శ్లాబ్‌ల వరకు పూర్తయ్యాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడతల్లో లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తున్నామన్నారు. బేస్ మెంట్ పూర్తైన తర్వాత లక్ష రూపాయిలు, గోడలు పూర్తైన తర్వాత రూ.1.25 లక్షలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న తర్వాత రూ.1.75 లక్షలు ఇల్లు పూర్తైన తర్వాత మిగిలిన లక్ష రూపాయిలు విడుదల చేస్తామని వివరించారు. వానాకాలాన్ని దృష్టిలోపెట్టుకొని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిజరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



