– హాస్పిటల్స్ లో సౌకర్యాల మెరుగుకు చర్యలు
-వేములవాడ హాస్పిటల్‌కు రూ.1.5కోట్ల వ్యయంతో పరికరాలు
– యువ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలి
– కేంద్ర మంత్రి బండి సంజయ్
-వేములవాడ హాస్పిటల్‌కు రూ.1.5కోట్ల వ్యయంతో పరికరాలు
– యువ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలి
– కేంద్ర మంత్రి బండి సంజయ్
వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పేరుతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ల్లో వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో సౌకర్యాలు కల్పించేందుకు యత్నిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా హాస్పిటల్ను మంగళవారం పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చాలా హాస్పిటల్స్ ల్లో సూదులు, మందులు, కాటన్ కూడా లేని పరిస్థితి ఉంటే నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హాస్పిటల్స్ ల్లో పేదలకు పూర్తిగా వైద్య సేవలందించేందుకు యత్నిస్తున్నానన్నారు. అందులో భాగంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ మిషన్ వంటి ముఖ్యమైన 16 వైద్య పరికరాలను అందించానన్నారు. వేములవాడ హాస్పిటల్లో రూ.1.5 కోట్లతో ఈ పరికరాలను కొనుగోలు చేశామన్నారు. దీంతోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట హాస్పిటల్స్ కు కూడా ఇదే స్థాయిలో వైద్య పరికరాలు అందిస్తున్నాం. అందుకోసం నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సహకారంతో రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులను సేకరించి ఈ వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆయా హాస్పిటల్స్ కు అందించామన్నారు. భవిష్యత్తులో ఈ హాస్పిటల్స్ కు అన్ని రకాల సహాయం అందిస్తా. యువ డాక్టర్లకు నా సూచన ఒక్కటే. డాక్టర్ల రిక్రూట్ మెంట్ కోసం కలెక్టర్ 89 వైద్య పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. యువ డాక్టర్లంతా దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందాలని కోరుతున్నా. కరీంనగర్ నుండి వేములవాడ ఎంతో దూరం కూడా లేదు. ఉద్యోగాల్లో చేరి ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. మీ చదువుకు సార్ధకత, మీ తల్లిదండ్రుల రుణం తీరాలంటే పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. కరీంనగర్ సహా ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసిన పేదలను ఆదుకుంటామన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్, అధికారులతో కొద్దిసేపు సమావేశమై హాస్పిటల్ అభివృద్ధి, పేదలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
———————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




