తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చండి

అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశాలు
యూరియా కోటా పెంచాలన్న సీఎం విజ్ఞప్తికి స్పందన

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరాలకనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటంతో భూమిలోని సారం తగ్గిపోతోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21శాతం అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని వెల్లడిరచారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు 12.4శాతం అదనపు వినియోగం జరిగిందని చెప్పారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రీయ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పీఎం ప్రణామ్‌ పథకం గురించి తెలంగాణ అధికారులకు కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్‌ కుమార్‌ మిశ్రా వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *