ఇంధన కొరత.. అసత్యం

– తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఇంధన కొరత ఉందనేది అసత్యమని, ఈ వదంతులను ప్రజలు నమ్మి అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని  తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపింది. సరఫరా గొలుసు (సప్లై చైన్) ఎక్కడా ఆగలేదన్నది. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని, దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు కానీ అది కొరత కాదని తెలిపింది. పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పెసో నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రమాదకరం, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చన్నది. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది. తప్పుడు వార్తలను నమ్మకండి లేదా ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

 పెట్రోల్, డీజిల్ కొరత లేదు
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయిస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని సూచించారు. నిన్న ఒక్క రోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను బంక్‌లకు పంపిణీ చేశామని, సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని తెలిపారు. రోజు వారీ అవసరాలకు సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని తెలిపారు.
అవసరానికి మించి కొనడంతో కృత్రిమ కొరత ప్రమాదం :కేంద్ర మంత్రి బండి 
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్ర‌చారాన్ని నమ్మవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉందని, రాష్ట్ర అవసరాలకు సరిపడా వాటి సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని, ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి చాలామంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగి కొన్ని బంకుల్లో తాత్కాలిక కొరత ఏర్పడుతోందని. దానివల్ల వాహనదారులకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఇదే అదనుగా కొంతమంది బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ హెచ్చ‌రించారు.
———————————————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *