నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

– రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ జీరో
– సీఎం.. ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు
– ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన గ్యారెంటీ నుంచి ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరించి గద్దెనెక్కిన రేవంత్ తీరా అది ఐదేళ్ల హామీ అని పీసీసీ చీఫ్‌తో సీఎం పలికిస్తున్న చిలుకపలుకులు చూసి యువత ఛీకొడుతోందన్నారు. తొలి ఏడాదే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని దిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులు కొట్టిన సీఎం ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతో రిక్రూట్‌మెంట్ జీరోగా మారిపోయిందని ఎండగట్టారు. అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆరఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని, పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వ చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును సమాజం గమనిస్తూనే ఉందని, రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, తన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటేనని అన్నారు. ముఖ్యమంత్రి నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని, నిరుద్యోగులకు, విద్యార్థులకు చేస్తున్న ఈ ద్రోహంపై వెంటాడతామని హెచ్చరించారు. ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని విమర్శించారు. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు రూ.2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారన్నారు. మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడన్నారు. చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను పెకలించే పరిస్థితిని త్వరలోనే చూస్తామని కేటీఆర్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *