మోదీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు కొత్త నిర్వచనమిచ్చిన న్యాయ సంస్కరణలు
2012లో జరిగిన దారుణమైన నిర్భయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన, పరిపాలనా వ్యవస్థలోని లోపాలను కూడా బహిర్గతం చేసింది. సరైన పోలీసు యంత్రాంగం లేకపోవడం, న్యాయ వ్యవస్థ స్పందనలో ఆలస్యం, కాలం చెల్లిన చట్టాలు, బాధితులకు సహకరించే వ్యవస్థలు లేకపోవడం వంటి అంశాలు నిరాశాజనకంగా మారాయి. 2014 నాటికి భారత్ నడిరోడ్డు లో నిలిచింది. ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తినా న్యాయ యంత్రాంగం ఏ మాత్రం చురుగ్గా స్పందించలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఒక కొత్త భావనగా తప్ప వాస్తవం కాలేకపోయాయి. ఒకే చోట నుంచి పరిష్కారాలు అందించే కేంద్రాలు కరువయ్యాయి. జాతీయ స్థాయిలో మహిళల సహాయ కేంద్రాలు లేవు. దర్యాప్తును వేగవంతం చేయడానికి అవసరమైన ఫోరెన్సిక్ మద్దతు అందుబాటులో లేదు. ఇలాంటి చర్యల కోసం ప్రత్యేక నిధులు అంతకంటే లేవు. మహిళల సమస్యలను సామాజిక అంశాలుగా చూడటమే తప్ప జాతీయ ప్రాధాన్యతగా ఎంత మాత్రం గుర్తించ లేదు.
జాతీయ నిబద్ధతగా చట్టపరమైన భద్రత
ప్రభుత్వం మొదట దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (ఎఫ్టీఎస్సీ) లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఈరోజు దేశంలో ఇటువంటి 745 కోర్టులు న్యాయ సేవలు అందిస్తున్నాయి. వాటిలో 404 కోర్టులు ప్రత్యేకంగా పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోస్కో) కింద నమోదు అయిన కేసులను విచారిస్తున్నాయి. 2014లో ఒకే చోట పరిష్కార కేంద్రాలు (వన్ స్టాప్ సెంటర్ – ఓఎస్సీ) ఒక్కటీ లేని పరిస్థితితో పోలిస్తే, ఈరోజు 820కి పైగా జిల్లాల్లో పూర్తిగా పనిచేస్తున్న ఓఎస్సీలు ఉన్నాయి. ఇవి హింసకు గురైన మహిళలకు ఒకే చోట న్యాయ సహాయం, పోలీసు జోక్యం, ఆశ్రయం, కౌన్సిలింగ్ వంటి సేవలను సమగ్రంగా అందిస్తున్నాయి.
మోదీ శకం: రక్షణ నుంచి నిర్మాణాత్మక సాధికారత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి కలిగిన నాయకత్వంలో, గత 11 ఏళ్ల పాలనలో భారత ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో సరైన స్పందన లేని స్థాయి నుంచి న్యాయసంస్కరణ, సంస్థాగత అమలు, ప్రతి మహిళకు గౌరవాన్ని అందించే నిర్దేశిత లక్ష్య సాధన దిశగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది.
ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటయిన జాతీయ మహిళా హెల్ప్‌లైన్ (181) ఇప్పటివరకు 24×7 ప్రాతిపదికన 86 లక్షలమందికి పైగా మహిళలకు అత్యవసర సహాయం అందించింది. ఇంకా, దేశవ్యాప్తంగా 14,600 పైగా పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు మహిళల సహాయ డెస్కులు పని చేస్తున్నాయి. వీటిలో చాలా వాటిని మహిళా పోలీస్ అధికారులే నిర్వహిస్తున్నారు. ఇవి ఇదివరకటి నిర్లక్ష్యం లేదా విముఖత ఉన్న వాతావరణాన్ని, మరింత సానుభూతి, సహాయం ఉన్న వాతావరణంగా మార్చాయి. 2014 ముందు మహిళల విషయంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థ బలహీనంగా ఉండేది. కానీ నిర్భయ ఫండ్ ద్వారా ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ కోసం పని చేస్తున్న 50 పైగా ప్రధాన ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది.
ప్రగతిశీల చట్ట సవరణలు
క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013 ద్వారా కొంతమేరకు అవసరమైన సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అయితే, 2023లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సంబంధిత చట్టాల ద్వారా జరిగిన సమగ్ర క్రోడీకరణతోనే భారతదేశం వలస యుగానికి చెందిన క్రిమినల్ న్యాయవ్యవస్థ నుంచి అసలైన మార్పునకు నాంది పలికింది. ఈ కొత్త చట్టాలు మహిళలపై జరిగే అన్ని నేరాలను ప్రత్యేక అధ్యాయంగా సమగ్రంగా పొందుపరచాయి. బాధితుల వాంగ్మూలాలను తప్పనిసరిగా వీడియో రికార్డ్ చేయాలనే నిబంధనను తీసుకువచ్చాయి. ఈ ప్రక్రియను మరింత సున్నితంగా జరిపేందుకు, మహిళా మేజిస్ట్రేట్ ద్వారా మాత్రమే వాంగ్మూలాల నమోదు జరగాలన్న నిబంధనను కూడా చట్టంలో పేర్కొన్నారు. డిజిటల్ స్టాకింగ్, లైంగిక కార్యకలాపాల్లో పరోక్ష ప్రమేయం, పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానాల ద్వారా మోసం చేయడం వంటి నేరాలను మొదటిసారి నేరంగా పరిగణించారు.
యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, గ్యాంగ్ రేప్, కస్టడీ లో లైంగిక హింసకు నేటి చట్టపరమైన వ్యవస్థ కఠినమైన శిక్షలను విధిస్తోంది. అంతేకాకుండా, అత్యాచార బాధితురాలి ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) నమోదు చేయడానికి నిరాకరించటం లేదా తక్షణ వైద్య సహాయం కల్పించకపోవటాన్ని ఇప్పుడు చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. మహిళలకు ఇప్పుడు ఏ రంగంలో అయినా, ఏ సమయంలో అయినా పనిచేయడానికి చట్టపరంగా అనుమతి కల్పించారు. పాతకాలపు రక్షణ ఆంక్షలను తొలగిస్తూ, వారి స్వయంప్రతిపత్తిని చట్టపరంగా గుర్తించారు. క్లిష్టమైన ప్రాసీజరల్ (న్యాయపరమైన ప్రక్రియల) సంస్కరణలను కూడా చేపట్టారు. వీటిలో సాక్షులకు రక్షణ కల్పించడం, డిజిటల్ ఆధారాలను చట్టబద్ధంగా అంగీకరించడం ముఖ్యమైనవి. ఈ చర్యలు లైంగిక హింసకు గురైన బాధితుల న్యాయ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తూ, మరింత భద్రతతో కూడిన న్యాయవిధానాన్ని కల్పిస్తున్నాయి. ఇవి కేవలం సవరణలు కావు – అవి బాధితురాలి పట్ల న్యాయ వ్యవస్థ పునఃసమీక్షకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
చట్టానికి అతీతంగా సాధికారత
చట్టపరమైన రక్షణ పరిధిని దాటి, సామాజిక, ఆర్థిక, డిజిటల్ సాధికారత కోసం విస్తృత చర్యలతో చట్టపరమైన సంస్కరణలను రూపొందించడం ప్రభుత్వ విధానం. ఇందులో భాగంగా ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పొడిగించారు. 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఇప్పుడు పిల్లల సంరక్షణ కోసం క్రెచ్ సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి. మహిళలు ఇప్పుడు సైనిక దళాల్లో యుద్ధ పాత్రల్లో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. వారు ఇప్పుడు సైనిక పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్నారు, ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) లో చేరుతున్నారు.
అలాగే ఒకప్పుడు తమకు అందుబాటులో లేని శాశ్వత పదవులను పొందుతున్నారు. ట్రిపుల్ తలాక్ వంటి వివక్షపూరిత పద్దతులను చట్టపరంగా రద్దు చేశారు. అదేవిధంగా, మహిళలకు ఇప్పుడు పురుష సహాయకుడు లేకుండానే హజ్ యాత్ర చేయడానికి చట్టపరంగా అనుమతి లభించింది. న్యాయాన్ని అందించే ప్రక్రియను కూడా స్థానిక స్థాయికి తేవడంతో పాటు డిజిటల్‌గా మార్చారు. సమాజ ఆధారిత నారీ అదాలత్‌లు, ఎస్హెచ్ఈ బాక్స్ 2.0. వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, బాధిత మహిళలకు తక్షణ న్యాయం అందే విధంగా పరిష్కార యంత్రాంగాలను నేరుగా గ్రామీణ స్థాయికి తీసుకువచ్చారు.
మహిళలకు చట్టపరమైన గౌరవంతో సురక్షితమైన, శక్తిమంతమైన భారత్
2014కి ముందు మహిళల భద్రతను ప్రధానంగా వార్తలపై స్పందించే అంశంగా మాత్రమే చూసేవారు. ఇది విధానపరమైన ప్రాధాన్యతగా కాకుండా ప్రతిస్పందనాత్మకంగా మాత్రమే కనిపించేది. ఈరోజు మహిళల భద్రత మొత్తం పాలనావ్యవస్థలో భాగంగా మారింది. దీని వెనుక నిధులు, ఫోరెన్సిక్ పరికరాలు, న్యాయ సంస్కరణలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల మద్దతు ఉంది. మనం అమృతకాలంలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో దృష్టికోణం స్పష్టంగా ఉంది..ఇకపై భారతదేశంలో ఏ ఒక్క మహిళ కూడా ఒంటరి కాదు. ఆమె భద్రత ఓ ప్రత్యేక హక్కు కాదు. అది ప్రభుత్వ భరోసాతో కూడిన భారత రాజ్యాంగం కల్పించిన హామీ. ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. అయితే, ఇప్పటికే మనం చాలా దూరం వచ్చాం. నిరంతర రాజకీయ సంకల్పం, సామాజిక భాగస్వామ్యం, చట్టపరమైన నిబద్ధతతో మహిళలు అర్ధవంతంగా జీవించడానికి, పనిచేయడానికి, నాయకత్వం వహించడానికి అత్యంత సురక్షితమైన దేశంగా భారత్ నిలుస్తుంది.

మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి





