చుట్టూ సంచరిస్తున్న గాయాల గొంతుకగా కవిత్వంలోకి వచ్చాను. ఉప్పొంగుతున్న దుఃఖాలకు ఊరటగా పాటలు కడుతూ ప్రవహించాను. తెలంగాణ నా ప్రాణం. సిద్ధిపేట జిల్లా బందారం ఊరు. నీళ్లు లేని పల్లెటూరు. సంసారం ఎల్లని వ్యవసాయం. ఘర్షణ పడినా గమ్యం చేరని ప్రయాణాలు. ఉత్త జీవితమే- తడితడిగా అంటుకునే జీవితమే నాకు బలం. నా రచనలకు బలం. వాక్యాలకు బలం. ప్రయాణమంతా ప్రయోగాలే.
తరుచుగా కలల్లో పెన్నులు దొరికేవి. పెన్నిధి అదే. రెక్కలొచ్చి రోదసిలో ఎగురుతున్నట్టు ఏదో ఉత్సాహం అందేది. మరే అంచుల నుంచో కొత్త చైతన్యం అందేది. దుఃఖాలెన్నున్నా అంతులేని ప్రేమలు. మనుషుల పట్ల భ్రమలతో, ప్రేమలతో అక్షరం మీద గొప్ప నమ్మకంతో జీవించాను. స్వప్నించాను – రాశాను. కవిత్వం, కథ, నవల, విమర్శ, పాట ఇరవై గ్రంథాలు ప్రచురించాను. ఎమ్మే చేశాను. డాక్టరేట్ చేశాను. ఉద్యోగం చేశాను. ఉపన్యాసాలతో ఊళ్లు తిరిగాను. కవిగా హృదయ ఘోషలు విన్నాను. మనుషుల్ని కలిశాను. రచయితల్ని కలిపాను. దుఃఖం లేని లోకం తప్ప మరేదీ కోరుకోలేదు.
ఎటు పొర్లినా దుఃఖమే ఎదురయ్యింది. ఏది రాసినా గాయాలు మానలేదు. అనుభవాలు మారలేదు. అదనంగా కొత్త దుఃఖం, కొత్త గాయం, కోవిడ్-19 కరోనా వైరస్ కాలాన్ని కల్లోల పర్చింది. దేశాలేమి, ఖండాలేమి ప్రపంచమే గజగజ వణికింది. ప్రాణికోటికి జీవనాధారమైన ప్రకృతి ప్రకోపించింది. మనిషికీ ప్రకృతికీ ఎందుకు చెడింది? ఎక్కడ చెడింది? స్వార్థంతో మనిషి చెట్లు నరికాడు. గుట్టలు కరిగించాడు. ఇసుక తరలించాడు. నదులు దారి మళ్లించాడు. గాలీ, నీరూ, భూమి కలుషితం చేశాడు. ఎన్ననీ? ఎన్ని తప్పిదాలు? ఒక్క దెబ్బతో మనిషి కకావికలమయ్యడు. ఆలోచనా ధోరణే మారింది. కలలు కుప్పకూలాయి. దేహాలు కుప్పపడ్డాయి. గొప్పలు పోయిన మనిషి చిన్న క్రిమికి హడలి హడలి చచ్చాడు. ఇష్టారీతి ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన మనిషి ప్రకృతి ముందు మోకరిల్లాడు.
కాలం దీర్ఘకావ్యం రాయమని ఒత్తిడి పెట్టింది. కరోనా గాయాలు కావ్యంగా మలిచాను. ప్రకృతి సంపద కాదు, ప్రాణప్రదాత. ఒక తరానిది కాదు, రాబోయే అనేక తరాలది. విధ్వంసమెంతో కాలం చెల్లదు. వైరస్ సైతం ఎంతోకాలం ఉండదు. ప్రకృతి శాశ్వతం. మానవుడు శాశ్వతం.
ప్రకృతి మానవ పరిణత బంధం ప్రాణ సమానం. రాత్రీపగలు రెప్పవాల్చనిది ప్రకృతి. ప్రకృతి ‘అనిమేష’. నేను రచించిన కావ్యం ‘అనిమేష’. సమస్త ప్రాణి సహజీవనమే నా సందేశం. సమరస జీవనమే కావ్య సందేశం.
‘అనిమేష’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆనందకరం. ఐదు దశాబ్దాల నా కవిత్వానికి అరుదైన గుర్తింపు. ‘అనిమేష’ను 2025 ఉత్తమ రచనగా ఎంపిక చేసిన జ్యూరీకి, నిపుణులకు, నిర్వాహకులకు, అకాడమికి అభివాదాలు. ధన్యవాదాలు. తెలంగాణ సంస్కృతీ ప్రేమికులకు, తెలుగు భాషా సాహిత్య పరిరక్షకులకు పురస్కారం అంకితం
కవిత్వం మేల్కొన్న వాళ్ల ప్రపంచం!
మేల్కొలిపే ప్రపంచం!
-నందిని సిధారెడ్డి





