“అసలు నేడు మనం నిజమైన ప్రజాస్వామ్యం వైపునకు పురోగమిస్తున్నామా? లేక ఎన్నికైనవారి నిరంకుశ త్వాన్ని భరించే వైపునకు పయనిస్తున్నామా? ప్రతి ఒక్కళ్లం అడగాల్సిన ప్రశ్న ఇది. ఎక్కడైతే అధికారాన్ని కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే అధికారాన్ని ప్రజాభిమానంతో కష్టపడి సంపాదించడం ఉండదో అక్కడ రాజకీయ నాయకులు చక్రవర్తులు మాదిరిగా ప్రవర్తిస్తారు. ప్రజలు కేవలం వోటు బ్యాంకుగా మిగిలిపోక తప్పదు.”
అది 1975వ సంవత్సరం…నేను 9వ తరగతి చదువున్నా. మా ఊరు ఒకనాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చుట్టూ అడవుల మధ్య మారుమూల ప్రాంతంలో ఉండేది . జిల్లాను విభజించిన తర్వాత మా ఊరు ములుగు జిల్లా పరిధిలోకి వచ్చింది. అప్పట్లో వరంగల్ నుంచి చల్వాయి వరకు తారురోడ్డు ఉండేది . అక్కడి నుంచి ఏటూరునాగారం వరకు మోరం రోడ్డుపై ప్రయాణం తప్పదు. మళ్లీ అక్కడినుంచి ఇరుకైన మట్టిరోడ్డు.ఈ రోడ్ల పై కేవలం ఎడ్ల బండ్లు మాత్రమే ప్రయాణించగలిగేవి. ఈ రోడ్లే మా గ్రామాలకు వెళ్లాలంటే దిక్కు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి దూరంగా వెలేసినట్టు, ఒంటరిగా నిశ్శబ్దంగా విసిరేసినట్టుగా మా ఊళ్ళు ఉండేవి . ఇటువంటి గ్రామాల్లో నివసించే ప్రజలకు ఒకరోజు వచ్చిన వార్త ఒక్కసారి ఆశ్చర్యానికి గురిచేసింది! నిజం చెప్పాలంటే వారికది నమ్మలేని నిజం! ఇంతకూ ఆ వార్త ఏంటంటే, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంగపేట మండలంలంలోని మా గ్రామం బోరు నరసాపురానికి 5-6 కిలోమీటర్ల దూరంలో నరసింహసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారనేది వార్త సారాంశం.
ఒక్కసారిగా గ్రామంలో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం, ఆశ్చర్యంతో కూడిన వాతావరణం! ఇరుగ్గా ఉన్న మట్టిరోడ్లను కాస్తంత వెడల్పు చేసి రెండు అంచులకు సున్నం గీతలు వేసే పనిలో శ్రామికులు తలమున కలుగా ఉన్నారు. మరి వస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదాయె! ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కాన్వాయ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టిరోడ్లను సరిచేసే పని ముమ్మరంగా సాగింది. ఇక మాగ్రామ పెద్దలకు క్షణం తీరిక లేకుండా పోయింది. గ్రామం మధ్యలో పెద్ద వేపచెట్టుంది. దాని చుట్టూ అరుగు! దీన్నే రచ్చబండ అని పిలిచేవారు. ఇంకేం…అంతా అక్కడ పోగై, ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సుదీర్ఘమైన వినతిప్రతం తయారుచేయడంలో తలమునకలయ్యారు. అంతేకాదు ఆయన వేపచెట్టు నీడలో కూర్చున్నప్పుడు తినడానికి ఏమేం అందించాలన్న దానిపై కూడా చర్చలు జరిగాయి.
ఇక చిన్నపిల్లలమైన మాకు రాజకీయాలంటే ఏంటో తెలియదు. అందువల్ల మా దృష్టి అంతా పెద్దలు ఆశపెట్టే స్వీట్లకే పరిమితం! ఇక ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వచ్చే రోజు రానే వచ్చింది. మిట్ట మధ్యాహ్నం…నడినెత్తిన సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ హుందాగా మాగ్రామంలోకి ప్రవేశించింది. ఊరిమధ్య వేపచెట్టువద్దకు రాగానే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న అంబాసిడర్ కారు ఆగింది. అందులోనుంచి ఆయన గంభీరంగా దిగి చిన్నగా నడుచుకుంటూ వేపచెట్టు నీడకు చేరి అరుగుపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ గుమికూడిన గ్రామపెద్దలు ఆయనకు వినతిప్రతం సమర్పించడంతో పాటు ఇక్కడి సమస్యలను ఏకరవు పెట్టారు. ఆయన మొత్తం సావధానంగా విని, అందరినీ పరామర్శించి నరసింహసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లిపోయారు.
ఈ తతంగం అంతా చూస్తున్న నేను, పెద్దల గుంపు మధ్యలోనుంచి దూరి ముఖ్యమంత్రి ఎదుట నిలుచున్నా. ఎటువంటి భేషజాలు లేవు. హంగామా లేదు. ముఖ్యమంత్రిని అంత దగ్గరగా ఎదురుగ్గా నిలుచొని చూడటం నాకు ఒకరకంగా ఆశర్యం, ఆనందం కలిగించింది. ప్రజల మధ్య తానొక నాయకుడిగా మాత్రమే ఆయన ఉన్నారు.
అప్పటి కాలం గుర్తుకు వస్తే గుండె లోతుల్లో ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. నాటి నాయకులు, దుమ్ము రోడ్లపై నడిచి, సామాన్యులతో భుజం భుజం రాసుకు తిరిగి, అందరితో కలివిడిగా ఉండేవారు. వాళ్లకు మా కష్టాలు తెలుసు. అందుకనే మేం బతుకుతున్న ప్రపంచంతో మమేకమయ్యారు. మరి నేడో…ఈ పరిస్థితికి పూర్తి భిన్నం. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఎందుకంటే ఒక వార్డు మెంబరుకు కూడా ఎక్కడలేని గర్వం! మంత్రులు, ముఖ్యమంత్రుల చార్టర్ విమానాల్లో మాత్రమే ప్రయాణిస్తారు. వాస్తవానికి అధికారం వీరిని సామాన్యులకు బాగా దూరం చేసింది! నిరంకుశ వ్యవహారశైలి.. రోజువారీ జీవితాలు ఎంతమాత్రం పట్టని వైఖరి వీరిది! ఎందుకిదంతా? వీరికి అధికారం ప్రజల విశ్వాసంతో వచ్చింది కాదు! కేవలం డబ్బుతో కొనడం వల్ల ఒనగూడింది! ప్రజలతో సన్నిహిత సంబంధం వల్ల వచ్చే వోట్లతో వీరు గెలవలేదు. లక్షలు ఖర్చు పెట్టి వోట్లను కొనుగోలు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు కనుకనే ఈ దర్పం, అహంకారం! రాజకీయ ప్రభుత్వాలు పోలీసులను కేవలం తమ రక్షణకు మాత్రమే వాడుకుంటాయి.
ఎమ్మల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు మాజీ ఎంపీలు వీరిని బాడీగార్డులుగా ఉపయోగించు కుంటారు. వీరిని బాడీ గార్డులు అనేకంటే కలెక్షన్ ఏజెంట్లుగా ఉపయోగపడతారనడం సముచితం! వీరికయ్యే ఖర్చు మొత్తం భరించేది ప్రభుత్వ ఖజానానుంచే! నిజాయితీగా చెప్పాలంటే ఏ కొద్దిమందికో ఇటువంటి బాడీగార్డులు అవసరమవుతారు. ముఖ్యంగా కొందరు జమిందారీతనాన్ని వెలగబెట్టే రాజకీయ దొంగలకే అనుక్షణం భయం ఉంటుంది . ఏకపక్షంగా తమ రక్షణకే పోలీసులను నియోగించడం వల్ల సామాన్యులను వారి ఖర్మకు వారిని వదిలేయడం జరుగుతోంది. ఇటువంటి వారు మొత్తం ప్రభుత్వాన్నే తమ జాగీరుగా భావిస్తారు.
ప్రజల ధనాన్ని లూటీచేసేవిధంగా, అతి చిన్న కారణాలను చూపుతూ భద్రతా బలగాలను దుర్వినియోగం చేస్తున్నారు. పరిశీలిస్తే నాటి నిజమైన ప్రజాస్వామ్యంలోని సరళత్వాన్ని దాటి మనం ఎంతో దూరం ప్రయాణించామ నిపిస్తుంది. అసలు నేడు మనం నిజమైన ప్రజాస్వామ్యం వైపునకు పురోగమిస్తున్నామా? లేక ఎన్నికైనవారి నిరంకుశ త్వాన్ని భరించే వైపునకు పయనిస్తున్నామా? ప్రతి ఒక్కళ్లం అడగాల్సిన ప్రశ్న ఇది. ఎక్కడైతే అధికారాన్ని కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే అధికారాన్ని ప్రజాభిమానంతో కష్టపడి సంపాదించడం ఉండదో అక్కడ రాజకీయ నాయకులు చక్రవర్తులు మాదిరిగా ప్రవర్తిస్తారు. ప్రజలు కేవలం వోటు బ్యాంకుగా మిగిలిపోక తప్పదు.
-ఎమ్ నాగేశ్వర్ రావు ఐపిఎస్ (రిటైర్డ్)
‘ఎక్స్’ వేదిక





