పుస్తకాలతో స్నేహం చేయాలి

– గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి పునాదులు
– నేటినుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు  

దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‌ 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు, పోటీలు, పుస్తక ప్రదర్శనలు, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకోవడంతోపాటు పిల్లలకు, విద్యార్థులకు, ఆసక్తి ఉన్న పాఠకులకు పఠన వాతావరణాన్ని కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం.  పుస్తకాలు మానవ జీవితానికి అద్దం. ఆలోచనల ఆవాసం. జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర సాధనాలు. మనిషి చరిత్రను, సంస్కృతిని, సృజనను పుటల్లో బంధించి నిలిపే మహోన్నత స్థానం గ్రంథాలయం. వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పుస్తక ప్రదర్శనలు, సాహిత్య సదస్సులు, ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటాయి. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడమే కాక, పుస్తకాల ద్వారా జ్ఞానం విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, యువత పుస్తకాలతో స్నేహం చేయాలని, ప్రతి వ్యక్తి తన జీవితంలో గ్రంథాలయాన్ని భాగస్వామిగా చేసుకోవాలనేది విద్యావేత్తల అభిప్రాయం. కాగా, పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించడం, గ్రంథాలయాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశాలు.
1. పుస్తకాల పట్ల ఆసక్తి పెంపొందించడం: ప్రజల్లో చదవాలనే అభిరుచిని, పుస్తకాల పట్ల ప్రేమను పెంపొందించడం.
2. గ్రంథాలయ సేవలను ప్రజలకు చేరువ చేయడం: పుస్తక ప్రదర్శనలు, ఉపన్యాసాలు, వర్క్‌షాపుల ద్వారా లైబ్రరీ సేవలను అందరికీ అందించడం.
3. గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేయడం: సమాజ అభివృద్ధిలో గ్రంథాలయాల పాత్రను గుర్తుచేయడం, వాటి అవసరాన్ని ప్రజలకు అవగాహన కల్పించడం.
4. చదువుకునే సంస్కృతిని ప్రోత్సహించడం: కుటుంబాలు, పాఠశాలలు, కాలేజీలు, సంస్థల్లో చదువు సంస్కృతి పెరగడానికి కార్యక్రమాలు నిర్వహించడం.
5. జ్ఞాన విస్తరణ: విద్యార్థులు, పరిశోధకులు, పాఠకులు అందరికీ గ్రంథాలయాల ద్వారా జ్ఞానం అందించడానికి ప్రోత్సహించడం.
6. సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం: పుస్తకాలు చదివి కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం.
7. డిజిటల్‌ గ్రంథాలయాల ప్రచారం: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ-బుక్స్‌, ఆన్‌ల్లైన్‌ లైబ్రరీలు వంటి సదుపాయాలను పరిచయం చేయడం.
8. గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించడం, పోటీలు, కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించడం .

వారోత్సవాల విశిష్టత

బాలల దినోత్సవం (నవంబర్‌ 14) నుండి ప్రారంభమై రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో వారోత్సవం సాగిపోతుంది. పుస్తకాల ప్రదర్శన, రచయితలతో చర్చలు, క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. గ్రంథాలయాల పాత్ర, సేవలను నేటి తరానికి పరిచయం చేయడంలో ఈ వారోత్సవానికి ప్రాధాన్యం ఉంటుంది. డిజిటల్‌ యుగంలో సమాచార వనరులు వేలమంది వేళ్లదాకా చేరినప్పటికీ గ్రంథాలయాల ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. కాగితపు పుటల్లో ముద్రించిన అక్షరాలు ఇప్పటికీ మనసుకు ప్రశాంతతను నింపుతాయి. ఇవి ఎటువంటి డిజిటల్‌ పఠనమూ అందించలేవు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల నిల్వ కాదు.. అది ఆలోచనల నిలయం. ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక సమాజపు జ్ఞాపకాల సమాహారం. విద్యార్థులకూ, పరిశోధకులకూ, పాఠకులకూ ఇది మార్గదర్శి. గ్రంథాలయ ద్వారం తట్టే ప్రతి అడుగు జ్ఞాన సమాజానికి అడుగుజాడ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డిజిటల్‌ లైబ్రరీలు, మొబైల్‌ లైబ్రరీ సేవలు, ఆన్‌లైన్‌ పుస్తక వనరులు వంటి పథకాలను విస్తరించే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువు చేరువ కావాలనే లక్ష్యంతో మొబైల్‌ గ్రంథాలయాలను ప్రోత్సహిస్తున్నారు. జ్ఞానం కేవలం పుస్తకాలలో కాదు.. పుస్తక పఠనం ద్వారా పుట్టే ఆలోచనలో ఉంది. జాతీయ గ్రంథాలయ వారోత్సవం మనకు గుర్తు చేసే విషయం ఇదే. చదువు అంటే పరీక్షలకు కాదు, మనసును మెరుగుపరచుకోవడానికే. పుస్తకాలను స్నేహితులుగా, గ్రంథాలయాలను స్ఫూర్తిగా చేసుకున్న ప్రజలతోనే జ్ఞాన సమాజం ఎదుగుతుంది. అందుకే గ్రంథాలయాలు కేవలం భవనాలు కావు.. అవి మనిషి ఆలోచనల ఆలయాలు. పుస్తకాలు, పత్రికలు, పరిశోధన గ్రంథాలు, ఇ-సమాచార వనరులు అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరికీ విజ్ఞానం పంచుతుంది. డిజిటల్‌ యుగంలో గ్రంథాలయాలు కూడా మార్పు చెందాయి. ఇప్పుడు ఇ-లైబ్రరీలు, ఆన్లైన్‌ డేటాబేస్‌ల ద్వారా విద్యార్థులు ఎక్కడినుంచైనా సమాచారాన్ని పొందగలుగుతున్నారు. గ్రంథాలయాలు చదవడానికి మాత్రమే కాక ఆలోచనల మార్పిడి, సృజనాత్మకత, పరిశోధనలకు కేంద్రాలుగా మారాయి. సమాజ అభివృద్ధికి, విద్యా పురోగతికి అవి కీలకం. అవి మన బౌద్ధిక, సాంస్కృతిక, నైతిక వికాసానికి బాటలు వేస్తాయి. సమాజంలో పుస్తక పఠనం అలవాట్లను బలోపేతం చేయడంలో, అక్షరాస్యతా రేటును పెంచడంలో గ్రంధాలయాలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయి. పౌర గ్రంథాలయాల అభివృద్ధికి ప్రధాన సమస్య ఆర్థిక వనరులు లేకపోవడం. గ్రంథాలయ సెస్‌ (పన్ను) సొమ్ము సక్రమంగా వసూలు చేసి గ్రంథాలయ అభివృద్ధికి పాడుపడితే నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది నియామకం, గ్రంథాలయాల భవన నిర్మాణం,  లైబ్రరీ ఆటోమైజేషన్‌, ఇతర చెల్లింపులు సక్రమంగా జరిగితే పౌర గ్రంథాలయాలు సమాజ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సమాచార సమాజాన్ని ప్రోత్సహించడానికి గ్రంథాలయాల అభివృద్ధికి పాఠకులు భావిభారత నాయకులుగా ఎదగడానికి ఒక రోడ్‌ మ్యాప్‌ను తయారు చేసి లైబ్రేరియన్లు, విద్యావేత్తలు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలి. నేటి డిజిటల్‌ యుగంలో పుస్తకాల విలువను గుర్తు చేస్తూ,గ్రంథాలయాల ప్రాముఖ్యతను స్మరింపజేయడమే జాతీయ గ్రంథాలయ వారోత్సవం అసలు ఉద్దేశం.

– డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి,
లైబ్రేరియన్‌,
కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌,
వరంగల్‌. 9849375829


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page