– యూఎస్-తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరేందుకు చర్యలు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని, అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కాన్సూల్ జనరల్ – అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడమనే రెండు అంశాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని వివరించారు. ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాది. ఎల్లప్పుడూ బలమైన దేశంగా, అనేక అంశాల్లో ఒక సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపగలిగిందన్నారు. తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉందని, స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. 2008 లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైంది. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించింది. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైంది. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారు.
ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళుతున్నారు. అమెరికా – తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరచడానికి మేం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా… 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ దార్శనికతకు కట్టుబడి మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు మాకు అమెరికన్ల మద్దతు కావాలి. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ముఖ్యంగా సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డు నెలకొల్పాయి. హైదరాబాద్‌లో మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.





