– యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఎవోయూ
– ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు
– ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన
– త్వరలోనే ఇండియా వస్తానన్న నెతన్యాహు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఐ పేమెంట్స్‌తో పాటు ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగనున్నట్టు ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 27 రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. మరోవైపు గాజాపై ప్రధాని మోదీ మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు. మానవత్వం ఎప్పుడూ సంఘర్షణకు బలికాకూడదని అన్నారు. ప్రస్తుతం శాంతి ప్రణాళిక ద్వారా ఓ ముందడుగు పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని మోదీ హా ఇచ్చారు. ••గా, త్వరలోనే భారత పర్యటనకు రావాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహును ఆహ్వానించారు. అంతకు ముందు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని నెతన్యాహు ప్రశంసించారు. ఆయన ప్రసంగం ప్రతి ఒక్కరినీ కదిలించిందని అన్నారు. భారత్‌కు రుణపడి ఉన్నామని అన్నారు. మోదీ తమకు స్నేహితుడు కంటే ఎక్కువని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త మైత్రికి నాంది పలికింది. విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు మోదీకి లభించిన ఘన స్వాగతం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది. సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన వ్యక్తిగత విషయాన్ని ఒకటి పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భార్యతో తన మొదటి డేట్ ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగిందని, ఆ భోజనం అద్భుతంగా ఉండటం వల్లే బంధం బలపడిందని నెతన్యాహు సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి తాను, తన పిల్లలు కూడా భారత్‌కు రుణపడి ఉంటామని ఆయన అనగానే ప్రధాని మోదీ నవ్వు ఆపుకోలేకపోయారు. భారత దేశంలోని అపారమైన ప్రతిభను, ఇజ్రాయెల్‌లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని కలపడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ప్రధానంగా కచ్చితమైన వ్యవసాయం, సాప్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధికి సంబంధించి రెండు దేశాల మధ్య 16 కీలక అవగాహన ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే భారత్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. ‘మా వ్యక్తిగత స్నేహం, ప్రభుత్వాల మధ్య సహకారం, ప్రజల మధ్య అనుబంధం నానాటికీ బలపడుతోంది‘ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. దీనిని కొనసాగించేందుకు సాధ్యమైనంత త్వరగా భారతదేశంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




