– ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ
– వాణిజ్య ఒప్పందంతో తగ్గనున్న స్కాచ్, కార్ల ధరలు
న్యూదిల్లీ, జనవరి 27: భారత్-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. భారత్-ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా ఎనర్జీ వీక్- 2026ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ఈ ఒప్పందంతో భారత్, ఐరోపా ప్రజలకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ప్రపంచంలోనే పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య సమన్వయానికి నిదర్శనం. ప్రపంచ జీడీపీలో ఇండియా, ఈయూ ఉమ్మడి వాటా 25శాతం. ప్రపంచవాణిజ్యంలో ఇది మూడోవంతుకు సమానం. ఈ డీల్ ఇరువర్గాల మధ్య వాణిజ్యాన్ని పెంపొదించడమేగాకుండా.. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలనపై మన నిబద్ధతను బలోపేతం చేస్తుందని మోదీ వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ సమావేశమయ్యారు. వారు ఇండియా-ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు గోవాకు వచ్చారు. మీరంతా ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు భారత్‌కు వచ్చారు. మా వద్ద భారీ రిఫైనింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విషయంలో మేం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. త్వరలో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంటాం అని వెల్లడించారు. భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తయింది. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారతీయ వస్తువులకు యూరోపియన్ మార్కెట్ల తలుపులు తెరుచుకుంటాయి. యూరప్ నుంచి దిగుమతి అయిన వస్తువులు భారతదేశంలో చౌకగా లభిస్తాయి. ఈ ఒప్పందాన్ని ’అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి’ అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అభివర్ణించారు. ప్రస్తుతం యూకే నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న స్కాచ్ విస్కీ, జిన్‌పై 150 శాతం సుంకాలను విధిస్తున్నారు. తాజా ఒప్పందం నేపథ్యంలో ఆ సుంకాలు 20 శాతానికి తగ్గుతాయి. అయితే దీనిని వెంటనే కాకుండా 5-10 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేస్తారు. దీంతో యూరప్‌నకు చెందిన ప్రీమియం జిన్‌లు, వైన్, వోడ్కాలు చౌకగా లభిస్తాయి. అలాగే భారతీయ మద్యానికి కూడా ఈయూ సభ్య దేశాలలో పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లకు ప్రస్తుతం 100 శాతం పన్నులు విధిస్తున్నారు. ఒప్పందం తర్వాత ఆ పన్నులు నిర్ణయించిన కాల వ్యవధిలో పది శాతానికి తగ్గుతాయి. అయితే రూ. 25 లక్షల కంటే తక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉన్న కార్లను మాత్రం భారత్‌కు ఈయూ ఎగుమతి చేయదు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడానికి ఈ నిబంధన పెట్టారు. యూరప్ నుంచి దిగుమతి అయ్యే కేన్సర్, ఇతర తీవ్రమైన అనారోగ్యాల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు కూడా తగ్గుతాయి. అలాగే యూరప్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వైద్య పరికరాల ధరలు కూడా తగ్గుతాయి.యూరప్ నుంచి దిగుమతి చేసుకునే విమానాల విడి భాగాలు, మొబైల్ ఫోన్లు, హైటెక్ ఎలక్టాన్రిక్ వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. ఇది భారతదేశంలో గాడ్జెట్ల తయారీ ఖర్చులను తగ్గిస్తుంది. తుది వినియోగదారునికి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు చౌకగా లభించవచ్చు.ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాల ప్రతిపాదన ఉంది. దీని వలన నిర్మాణ, పారిశ్రామిక రంగాలలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయి. అలాగే చాక్లెట్లు, సౌందర్య సాధనాలు, పలు గృహోపకరణాలు కూడా గతంలో కంటే చౌకగా లభిస్తాయి. ఇక, భారత్‌లో తయారయ్యే వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచర్, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలపై ఈయూ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ మేరకు భారతీయ వస్త్ర, ఫుట్‌వేర్, ఆటో మొబైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థలు భారీగా లాభపడనున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




