ఉచిత కరెంటు పేటెంట్‌ వైఎస్‌ది

– ఆయన ఆలోచనలు, కాంగ్రెస్‌ భావజాలాన్ని అమలు చేస్తున్నాం
– వైఎస్సార్‌ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్‌ బావజాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వైఎస్‌ స్మారక అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైఎస్‌ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.21 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశాం, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రైతులు పండిరచిన పంటకు మద్దతు ధర అందించడమే కాక సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ అందిస్తున్నామని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నడి వేసవిని లెక్క చేయకుండా తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలోని తాడిత, పీడితుల, రైతుల సమస్యలను తెలుసుకుని అవగాహన చేసుకున్నారని, ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. భారతదేశంలో ఎవరైనా ఉచిత విద్యుత్తు అందజేస్తున్నారంటే అది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేటెంట్‌ అని అన్నారు. వైఎస్‌ పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అనంతపురంలో సోనియా గాంధీని ఆహ్వానించి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు పంట పెట్టుబడి ఒక్కటే కారణం కాదు, పెరిగిన విద్య, వైద్యం ఖర్చులు కూడా కారణమని ఆయన గుర్తించి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ఉచిత కరెంటు, సకాలంలో వ్యవసాయ రుణాలు అందిస్తూ రైతు కుటుంబాలపై విద్యా భారం తగ్గించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వైద్య భారం తగ్గించేందుకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.
పాలన అంటే ఎలా ఉండాలి, ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చూపించిన మహానేత వైఎస్‌ అని, ఆయన భావాలు, ఆలోచనలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వారి మిత్రులుగా మనందరిపై ఉందని తెలిపారు. మిత్రుడుగా కేవీపీ రామచంద్ర రావు ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమం అభినందనీయమన్నారు. కెేవీపీ మనవళ్లు రూ.25 లక్షల నగదు బహుమతిని వైఎస్‌ స్మారక అవార్డుల పేరిట ఇవ్వడం అభినందనీయమన్నారు. కేవలం వైఎస్‌ జయంతి, వర్థంతులే కాకుండా వారు చేసిన పనులకు గుర్తింపుగా వైఎస్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి స్మారక అవార్డు ఇవ్వాలని 76వ జయంతి సందర్భంగా నిర్ణయం తీసుకొని వైఎస్‌కు అత్యంత ప్రీతి ాత్రమైన వ్యవసాయ రంగంలో అవార్డులు ఇవ్వడం అభినందించదగిన విషయమని భట్టి అన్నారు. రైతుల శ్రమ, వారి ఇబ్బందుల పరిష్కారానికి జీరో బడ్జెట్‌తో సేంద్రియ వ్యవసాయం ద్వారా దేశానికే కాదు ప్రపంచానికే సందేశం ఇస్తున్న పాలేకర్‌ సేవలు అభినందనీయమన్నారు. తొలుత వైఎస్‌ చిత్రపటం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, హాజరైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ హుడా, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి శ్రీధర్‌బాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెేవీపీ రామచంద్రరావు, పీసీసీ మాజీ చీఫ్‌ రఘవీరారెడ్డి. రఘవీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *