స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తిస్తాం

– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన

ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : మధ్యప్రాచ్యంలో న్యాయమైన, స్థిరమైన శాంతికి పాలస్తీనాను ఫ్రాన్స్‌ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ గురువారం రాత్రి ప్రకటించారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే అంశంపై నెలలతరబడి సంకేతాలు, సందేహాల తరువాత ఆయన సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘ గాజాలో యుద్ధం ఆగడం ఈ రోజు తక్షణ అవసరం.. అక్కడి పౌరులకు సహాయం అందాలి అని మాక్రాన్‌ అన్నారు. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ సైనిక దాడులు, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలితో ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఫ్రాన్స్‌, పాలస్తీనాను దేశంగా గుర్తించిన మొదటి గ్రూప్‌ ఆఫ్‌ 7 (జీ-7) దేశం కానుంది. ఈ జీ-7 దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ, జపాన్‌, ఇటలీ ఉన్నాయి. ఫ్రాన్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న ట్రంప్‌ పరిపాలనను ఇబ్బంది పెట్టే అవకాశముంది. ట్రంప్‌ ప్రభుత్వం కూడా గాజా యుద్ధాన్ని ముగించేందుకు తనదైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *