నాలుగోసారి కూడా వాత తప్పదు

– బీఆర్‌ఎస్‌ నేతలు విషం నింపుకుని కారుకూతలు కూస్తున్నారు
– నాటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు
– కాంగ్రెస్‌ సర్పంచుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి

అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జనవరి 13: అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదని, ఒళ్లంతా విషం నింపుకొని కారుకూతలు కూస్తున్న నాటి ‘ప్రభువుల’కు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగోసారీ వాత తప్పదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. అశ్వారావుపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ మద్దతుదారులైన 60 మంది సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేని వారు ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో సొల్లు వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో నియోజకవర్గానికి కనీసం పది ఇళ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే మూడుసార్లు చెంప ఛెళ్లుమనిపించిన ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేట గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో తమ ప్రభుత్వం 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, గిరిజన ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మేడారం జాతరను 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని రీతిలో అద్భుతమైన రాతి కట్టడాలతో పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడిరచారు. కాగా, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, గ్రామాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ కాంగ్రెస్‌ని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మువ్వా విజయబాబు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, తదితరులు ప్రసంగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *