– రాష్ట్రపతి ఆమోదముద్ర
– గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరంతా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగారు. ఆ తర్వాత పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి గతంలో సిఫార్సు చేసింది. ఈనెల 1, 2 తేదీల్లో కొలీజియం సమావేశమై దేశంలోని ఎనిమిది హైకోర్టులకు 36 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వారిలో తెలంగాణకు నలుగురిని విషయంలో రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో గెజిట్ ప్రచురణ జరిగింది. ఈ నలుగురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్‌తో కలిపి మొత్తం న్యాయమూర్తులు 26 మంది ఉన్నారు. కొత్త వారు ప్రమాణస్వీకారం చేస్తే ఆ సంఖ్య 30కి పెరిగిన తరువాత మరో 12 పోస్టులు (మొత్తం 42) ఖాళీగా ఉంటాయి. === గౌస్ మీరా మొహినుద్దీన్ హైదరాబాద్, బాలానగర్‌కు చెందిన మొహినుద్దీన్ 1969 జులై 15వ తేదీన జన్మించారు. ఏపీలోని నెల్లూరు వీఆర్ లా కాలేజీలో 5 ఏండ్ల లా పూర్తి చేశారు. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1993 మార్చి 17న ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసులు వాదించిన అనుభవం ఉంది. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్‌ఎంటీ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. === సుద్దాల చలపతిరావు జిల్లా కేంద్రం జనగాంలో 1971 జూన్ 25న జన్మిచారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది వై.S రామారావు వద్ద జూనియర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో రాణించిన అనుభవం ఉంది. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ పనిచేస్తున్నారు. వాకిటి రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు మండలంలో 1970 సెప్టెంబరు 14న జన్మించారు. బీకాం, ఎల్‌ఎల్బీ చేశాక 1998 ఏప్రిల్ 2న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ అడ్వొకేట్ ఎ. అనంతరెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. హైకోర్టు, లోయర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ, క్రిమినల్, రెవెన్యూ, టాక్స్ కేసుల్లో అనుభవం ఉంది. పలు ప్రైవేటు కంపెనీలు, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్‌గా చేశారు. గాడి ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా భీంగల్ లో 1971 ఆగస్టు 28న పుట్టారు. ఉస్మానియాలో ఎంఏ ఆర్ట్స్, కాకతీయ యూనివర్సిటీలో లా, ఉస్మానియా యూనివర్సిటీలో లా మాస్టర్స్ చేశారు. 1999లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యాక హైకోర్టు న్యాయవాది జయప్రకాశ్‌రావు వద్ద జూనియర్‌గా చేరారు. హైకోర్టు, అడ్మినిస్ట్రేవ్ ట్రైబ్యునల్, లేబర్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగం, సర్వీస్, కాంట్రాక్ట్, లేబర్, సివిల్, క్రిమినల్ లా కేసులను వాదించిన అనుభవం ఉంది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా గతంలో చేశారు. ఇప్పుడు డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా చేస్తున్నారు.



