హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13 : దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత,  విద్యావేత్త సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ‌నివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లుగా నాగ్‌పుర్ జైలులో శిక్ష అనుభవించారు. ఈ ఏడాది మార్చిలోనే బాంబే హైకోర్టు ఆధ్వర్యంలోని నాగ్‌పూర్ బెంచ్ ధర్మాసనం ఆయనను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన ఆయన గుండె సంబంధిత సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నేడు  అంత్య‌క్రియ‌లు
హైదరాబాద్, మౌలా అలీ,  జవహర్ నగర్, శ్రీనివాస హైట్స్, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా నివాసంలో సాయిబాబాకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు  నేడు  ఉదయం 10 గంటల నుంచి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు నివాళులర్పించ వచ్చ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. కాగా ఆదివారం ప‌లువురు సాయిబాబా పార్థీవ దేహాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు. కాగా ప్రొఫెస‌ర్ సాయిబాబా కోరిక మేరకు ఆయ‌న నేత్రాల‌ను ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ కంటి ద‌వాఖాన‌కు దానం చేశారు.
సాయిబాబా మృత‌దేహాన్ని హాస్పిటల్ కు అప్ప‌గిస్తాం : కుటుంబ స‌భ్యులు
సాయిబాబా  భౌతికకాయాన్ని హాస్పిట‌ల్ కి  అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన కళ్లను ఎల్వీప్రసాద్‌ కంటి ద‌వాఖానాకు దానం చేస్తున్నట్లు చెప్పారు. సాయిబాబా భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు తరలించారు. ఆత్మీయుల నివాళి అనంతరం భౌతికకాయన్ని ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రముఖుల నివాళి

“విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా గారి మృతి బాధాకరం…ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొంటూ
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు.ప్రొ సాయిబాబా మృతిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటని అన్నారు. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం వినిపించారని చెప్పారు. పౌర హక్కులను కాపాడే క్రమంలో సవాళ్లు ఎదురైనా సాయిబాబా చూపిన ధైర్యసాహసాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. సాయిబాబాను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా ప్రొఫెస‌ర్‌ సాయిబాబా మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక‌ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90 శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను ఉపా చట్టం కింద సుదీర్ఘ కాలంగా జైలులో నిర్బంధించిందని ఆయన మండిపడ్డారు. ఆయనపై బీజేపీ అర్బన్‌ నక్సలైట్‌గా ముద్రవేసిందని అన్నారు. సాయిబాబా జైలులో ఉండగా అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యారని.. ఆయనకు సరైన వైద్య సదుపాయాలు కూడా అందించలేదని విమర్శించారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. సాయిబాబా మృతి తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.