అనారోగ్యంతో మాజీ డీజీపీ హెచ్‌జె దొర మృతి

– పోలీస్‌ ‌శాఖలో కీలక పదవుల నిర్వహణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ హెచ్‌.జె దొర మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్‌ ‌చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో బాత్‌రూమ్‌లో పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. 1965 ఐపీఎస్‌ ‌బ్యాచ్‌ అధికారి హెచ్‌.‌జె.దొర.1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఏపీ డీజీపీగా దొర విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఉమ్మడి ఏపీలో నక్సలైట్లను అణచివేయడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే సీఐఎస్‌ఎఫ్‌ ‌డీజీగా, విజిలెన్స్ ‌కమిషనర్‌గా సైతం దొర పని చేశారు. 1943లో శ్రీకాకుళంలో దొర జన్మించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పోలీస్‌ ‌విభాగంలో వివిధ హోదాల్లో ఆయన సేవలందించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు మొదట అడిషనల్‌ ‌డీజీపీగా, అనంతరం డీజీపీగా దొర బాధ్యతలు చేపట్టారు. 2002లో డిప్యూటేషన్‌పై దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్‌ ‌డీజీగా పని చేశారు. పోలీసు శాఖతోపాటు క్రీడారంగంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఇండియన్‌ ఒలంపిక్స్, ‌వెయిట్‌ ‌లిప్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 1993లో పీపుల్స్ ‌వార్‌ ‌గ్రూపు లక్ష్యంగా చేసుకున్న 40 మంది పోలీసు అధికారుల జాబితాలో హెచ్‌.‌జె.దొర పేరు కూడా ఉంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పోలీస్‌ ‌మెడల్‌ అం‌దుకున్నారు.

మార్గదర్శిని కోల్పోయాం : డిజిపి శివధర్ రెడ్డి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపిగా విశేష సేవలందించిన ప్రతిభావంతుడైన ఐపిఎస్ అధికారి హెచ్.జె.దొర మృతి పట్ల రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారిగా పోలీసు శాఖలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఆయన మరణంతో ఒక నిబద్ధత కలిగిన మార్గదర్శిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. దొర డిజిపిగా ఉన్న సమయంలో పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సమీక్షించేందుకు ‘రిట్రీట్’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేవారని, ఆ స్ఫూర్తితోనే దాదాపు రెండున్నర దశాబ్దాల విరామం తర్వాత ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పోలీసు శాఖలో ఈ ‘రిట్రీట్’ మళ్లీ ప్రారంభించినట్లు శివధర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8న జరిగిన ఆ ప్రారంభ వేడుకలో హెచ్.జె. దొర పాల్గొని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారని, ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావడం అత్యంత విచారకరమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రజా సంబంధాల వ్యవస్థను ప్రారంభించడం వంటి వినూత్న కార్యక్రమాలను ఆయన చేపట్టారని డిజిపి కొనియాడారు. గతంలో తాను నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో హెచ్.జె.దొర తనను ఒక పరిణతి చెందిన ఐపిఎస్ అధికారిగా అభివర్ణించారని గుర్తు చేసుకున్నారు. దొరతో తనకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని, ఆయనకు వ్యక్తిగతంగా తనపై ఎంతో అభిమానం ఉండేదని డిజిపి శివధర్ రెడ్డి చెప్పారు. విధి నిర్వహణలో తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని, ఆ చొరవతోనే ఆయన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం ఎస్పీగా తనకు పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. సిబ్బంది సంక్షేమం కోసం ఆయన భద్రత, ఆరోగ్య భద్రత వంటి వినూత్న పథకాలను ప్రారంభించారని తెలిపారు. నాటి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ నక్సలైట్ల జననాట్య మండలికి దీటుగా పోలీసు కళాబృందాలను ఏర్పాటు చేసి సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నక్సలిజంపై పోరు అత్యంత కీలక దశలో ఉన్న సమయంలో పోలీసు బలగాల సామర్థ్యాన్ని పెంచడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని శివధర్ రెడ్డి వివరించారు. నక్సలైట్లతో అంతిమ యుధ్ధానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులను సన్నద్ధం చేశారని, అందువల్లనే నక్సలైట్లు భారీగా నష్టపోయి 2009-10 కాలంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్ళి దండకారణ్యంలో తలదాచుకున్నారని శివధర్ రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ కేంద్రాలు (డిటిసిలు), కమిషనరేట్ శిక్షణ కేంద్రాలు (సిటిసిలు), బెటాలియన్ శిక్షణాకేంద్రాలు (బిటిసిలు) నెలకొల్పి శిక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని గుర్తుచేశారు. కింది స్థాయి సిబ్బంది క్షేమం పట్ల ఎంతో తపన పడేవారని, యువ అధికారులకు మార్గదర్శిగా నిలుస్తూ వారిని ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని కొనియాడారు. ఒక గొప్ప దార్శనికుడిగా ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని డిజిపి అభిప్రాయపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని డిజిపి శివధర్ రెడ్డి తెలియజేశారు.

————————————————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *