పిల్ల‌ల కోసం ప‌క్షుల మినీ జూ ఏర్పాటు

– నాంపల్లి ఎగ్జిబిష‌న్‌లోఅటవీ శాఖ స్టాల్ ప్రారంభం
– వివిధ అట‌వీ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: నాంపల్లి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్‌ను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షకులు డా. సువర్ణ బుధ‌వారం ప్రారంభించారు. అడ‌వులు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అటవీ శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రదర్శించడమే ఈ స్టాల్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్టాల్ లో అటవీ సంరక్షణ, వన్యప్రాణి నిర్వహణ, పరిశోధన, సమాజ భాగస్వామ్యం వంటి విభాగాల్లో శాఖ చేపడుతున్న కార్యక్రమాలను సమగ్రంగా చూపిస్తున్నారు. వివిధ నమూనాలు, పోస్టర్లు, సమాచార ఫలకాలు, ఇంటరాక్టివ్ అంశాల ద్వారా అన్ని వయస్సుల సందర్శకులకు అటవీ ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర గురించి అవగాహన కల్పించేలా ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్ ఐ), నెహ్రూ జూలాజికల్ పార్క్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, అలాగే వెదురు ఉత్పత్తుల విభాగాల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో పరిశోధన కార్యకలాపాలు, వన్యప్రాణి సంరక్షణ చర్యలు, ఎకో టూరిజం కార్యక్రమాలు, అటవీ ఆధారిత జీవనోపాధుల అభివృద్ధిపై సమాచారం అందిస్తున్నారు. ఎఫ్‌సీఆర్ ఐ ద్వారా తయారైన స్వచ్ఛమైన తేనె విక్రయం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది సహజ అటవీ ఉత్పత్తుల ప్రోత్సాహం, శాస్త్రీయ తేనెటీగల పెంపకం పట్ల అటవీ శాఖ చేస్తున్న కృషికి ప్రతీకగా నిలుస్తోంది. పిల్లలు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా పక్షుల మినీ జూ ఏర్పాటు చేశారు. దీని ద్వారా చిన్నారులు పక్షుల వైవిధ్యాన్ని దగ్గరగా చూసి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. అంతేకాక అటవీ శాఖ కార్యకలాపాలు, వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా సాధించిన విజయాలను చూపించే వీడియోలను నిరంతరం ప్రదర్శించే ఏర్పాటు చేశారు. జంతువుల ప్రతిరూపాలతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులను ఆకట్టుకునేలా, అలాగే వన్యప్రాణి సంరక్షణ సందేశాన్ని సృజనాత్మకంగా అందించేలా ప్రత్యేక ఆకర్షణలు కల్పించారు. ఈ  కార్యక్రమంలో ప్రధాన అటవీ సంరక్షకులు రత్నాకర్ జౌహరి, అటవీ సంరక్షకులు ప్రియాంక వర్గీస్, అటవీ సంరక్షకులు (పరిశోధన & అభివృద్ధి) శ్రీ కృష్ణ పాల్గొన్నారు. ——————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *