– అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలి
– అడవి జంతువుల దాడి బాధితులకు తక్షణ పరిహారం
– అధికారుల ప్రమోషన్లు, అవార్డులకు ప్రతిపాదనలు పంపాలి
– అటవీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రాష్ట్రంలో ఎకో టూరిజం(eco tourism) అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth)అధికారులను ఆదేశించారు. సింగపూర్(Singapore) వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు, అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున మనకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణవాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళుతున్నారని, మన టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెరిగేలా సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలన్నారు. కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్‌లో జూను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయపడిన వారికి, పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలని సూచించారు. అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధించాలన్నారు. అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. అటవీ శాఖలో అధికారుల కొరతపైనా ఆరా తీశారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్‌ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్రదించాలని సీఎస్‌కు సూచించారు. అటవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. శాఖలో ఉత్తమ పని తీరు కనబరుస్తున్న వారికి అవార్డులు ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలని సీఎం సూచించారు. సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎలుసింగ్ మేరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




