ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా దుష్ప్రచారం

– భారత్‌పై పాక్‌ దాడికి ఒక్క ఆధారమైనా చూపగలరా
– లక్ష్యాలను చేధించడంలో భారత్‌ అసమాన ప్రతిభ
– ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌

చెన్నై, జులై 11: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్‌ విసిరారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌ 62వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడున్నారనే కచ్చితమైన సమాచారంతో పాకిస్థాన్‌ లోపలకు వెళ్లి విజయవంతంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్‌ కూడా మిస్‌ కాలేదని చెప్పారు. భారతదేశ ఇంటెలిజెన్స్‌, కార్యాచరణ కచ్చితత్వాన్ని ఈ మిషన్‌ చాటిచెప్పిందన్నారు. కేవలం 32 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ పూర్తి చేసినట్టు చెప్పారు. భారతదేశ వ్యూహాత్మక ఆపరేషన్‌ విశ్వసనీయతను ప్రశ్నించే వారు భారత్‌ వైపు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఫోటోనైనా చూపించాలని సవాల్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ కార్యక్రమంలో భారత సైన్యం స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి దాయాదికి ముచ్చెమటలు పట్టించిందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ అది చేసింది.. ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్నగీత కూడా పడనివ్వలేదని అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తోందని దోవల్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్థాన్‌ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయ న్నారు. పాకిస్థాన్‌ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాప్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే సమర్థమంతంగా పేల్చివేశాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *