మున్సిపల్‌ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– మూడు వేల అదనపు బలగాలతో బందోబస్తు
– పోలింగ్‌ ‌కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌
‌- ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు
– డీజీపీ శివధర్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని చెప్పారు. ఇతర శాఖల నుంచి మూడు వేల అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ ‌కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. వోటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా వోటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం.. 4,318 మందిని బైండోవర్‌ ‌చేశాం.. 398 నాన్‌-‌బెయిలబుల్‌ ‌వారెంట్లు జారీ చేశాం.. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 55 చెక్‌పోస్టులు ఉన్నాయి.. 181 ప్లయింగ్‌ ‌స్క్వాడ్స్ ‌సిద్ధం చేశాం.. ఇప్పటివరకు రూ.3.09 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 142 కేసులు నమోదు చేశామని వివ‌రించారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ డేటాను రిట్రీవ్‌ ‌చేస్తున్నాం 

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. ఆత్మహత్య లేఖ రాయలేదని తెలిసింది.. విచారణలో వివరాలు తెలుస్తాయని డీజీపీ చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ ‌ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. ఏసీబీ కేసు 2015లో ఉన్న ఆధారాలు కోర్టుకు ఇచ్చాం.. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కూడా అన్నీ పరిశీలించి నివేదికలు ఇచ్చాం.. సాంకేతిక నిపుణులతో డేటాను రిట్రీవ్‌ ‌చేస్తున్నాం అని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ ‌లోని సర్వర్‌ ‌రూమ్‌లు పూర్తిగా కాలిపోయాయని వెల్లడించారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఈ సర్వర్లకు ఎటువంటి బ్యాకప్‌ ‌వ్యవస్థ అందుబాటులో లేదన్నారు. సర్వర్‌ ‌రూమ్‌ ‌పూర్తిగా దగ్ధమైంది. డేటా బ్యాకప్‌ ‌లేకపోవడం వల్ల కొంత సమాచారం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగి కాలిపోయిన సర్వర్ల నుండి డేటాను వెలికితీసే ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కొన్ని కీలక కేసుల ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారాన్ని డీజీపీ కొట్టిపారేశారు. ముఖ్యంగా 2015 నాటి ఏసీబీ కేసుల వోటుకు నోటు వంటివి గురించి ప్రస్తావిస్తూ ఆ కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము 2021లోనే కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. అందువల్ల ఇప్పుడు జరిగిన ప్రమాదానికి, ఆనాటి కేసుల ఆధారాలకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసుపై కూడా స్పందించారు. ఈ కేసులో కావాల్సిన అన్ని అంశాలను ఇప్పటికే నిశితంగా పరిశీలించామని, సంబంధిత నివేదికలను ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశామని డీజీపీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *