ఫుడ్ సేఫ్టీ అందరి బాధ్యత

– అవేర్‌నెస్ వాకథాన్‌లో మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమష్టి బాధ్యత అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌లో సోమవారం పాల్గొన్న ఆయన జల విహార్ వద్ద జెండా ఊపి వాక్‌ను ప్రారంభించారు. హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో వాకథాన్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 1.41 లక్షల ఆహార వ్యాపార సంస్థలు ఉన్నాయని, వీటిలో 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం నగరాల్లో తినడానికి సిద్ధంగా, ప్రాసెస్‌డ్ ఆహార పదార్థాలకు ఉన్న అధిక డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితిని కొంతమంది దుర్వినియోగం చేస్తూ దాదాపు ప్రతీ ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నార న్నారు. ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, చాయ్ పత్తి.. ఇలా దేన్నీ వదలడం లేదని, ఇంకొంతమంది నాసిరకం నూనెలు, నాణ్యత లేని పదార్థాలతో ఆహారం తయారు చేసి విక్రయిస్తున్నారని, ఇలాంటి కల్తీ, నాసిరకం ఆహారం వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ, నాసిరకం ఆహారం తిన్న ప్రజలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అధిక బరువు వంటి సమస్యలకు కూడా కల్తీ, నాసిరకం ఆహారం కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అంతటా నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయన్నారు. ఈ రోగాల వల్ల ప్రజలు శారీరకంగా ఇబ్బందిపడడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని, పరోక్షంగా ఇదంతా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భవిష్యత్తులో తనిఖీలను మరింత కఠినతరం చేసి, ఎలాంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తామని మంత్రి దామోదs స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామని, ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపామని చెప్పారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్లతో మూడు కొత్త రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఫుడ్ సేఫ్టీ కోసం కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారని తెలిపారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం త్వరలోనే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పౌరుడికి సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో ఫుడ్ ఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, ఈ రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే బాధ్యతతో కూడిన వృద్ధిని కూడా ఆశిస్తోందని అన్నారు. ‘ఈట్ రైట్-స్టే హెల్తీ’ అనే సందేశాన్ని అందరం ఆచరిద్దాం.. కలిసికట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించుకుందాం అని మంత్రి రాజనర్సింహ పిలుపునిచ్చారు. వెయ్యిమంది విద్యార్థులు, యువత జలవిహార్ నుంచి హెచఎండీఏ గ్రౌండ్స్ వరకూ ఉత్సాహంగా సాగిన ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌టో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, తదితరులతో కలిసి మంత్రి రాజనర్సింహ నడిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *