– 66మంది విద్యార్థులకు అస్వస్థత
– పలు హాస్పిటల్స్‌లో చికిత్సలు
– సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 13: హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మాదాపూర్ పరిధిలోని చంద్రానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో కలుషితమైన పాయసం తిని 44మంది విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. అన్ని వసతులూ అందుబాటులో ఉండాల్సిన మహానగరంలోనే ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం బారినపడ్డారు. విద్యార్థులకు కింగ్‌కోఠి, నిలోఫర్, కొండాపూర్ దవాఖానలు, రెయిన్‌బో హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నారు. బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకులంలో 337 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనం తిన్న తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి, నిలోఫర్ దవాఖానలకు తరలించారు. పాడైన పెరుగు తినడం వల్లే ఆస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. ఘటన గురించి తెలిసి తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు, దవాఖానల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే చంద్రానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న తనవాత 44 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు అంబులెన్స్ ద్వారా 38 మందిని కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నానక్‌రాంగూడలోని రెయిన్‌బో దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్న భోజనంలో పాడైన పాయసం తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది. 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా ఉపాధ్యాయులు తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. సాయంత్రమైనా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని, దవాఖానకు తరలించినట్లు తెలిపారని వాపోయారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైనా సమాచారం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





