‘స్థానిక’ ఎన్నిక‌లు,  బనకచర్లపై ఫోకస్

రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశంలో చ‌ర్చ‌!

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూన్ 23 : గోదావరి – బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర మంత్రి వ‌ర్గం సుదీర్ఘంగా చ‌ర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తెలంగాణ సచివాలయంలో జ‌రిగింది. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మొదటి సారిగా ఈ భేటీకి హాజరయ్యారు. తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రిమండలి చర్చిన‌ట్లు స‌మాచారం. రాజీవ్ యువ వికాసం పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు, సంక్షేమ పథకాలకు సమర్థవంతంగా కొనసాగించడానకి నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చించిన‌ట్లు స‌మాచారం. బ‌నకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చ‌ర్చించారు.  ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా దిల్లీకి వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ కలిసి పూర్తి వివరాలను తెలిపారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ వ్యూహం ప్రకారం నిర్వహించాలి? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా కల్పించాలని చర్చించిన‌ట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల వివాదం న్యాయస్థానంలో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ దఫాకు ముందుకెళ్లాలా? అనే అంశం చర్చ కు వ‌చ్చింది! గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై మరింత విస్తృత ప్రచారం ఎలా కల్పించాలి? తదితర అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వొచ్చిన‌ట్లు  తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *