- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో జరిగిన సాగునీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో వారు పలు అంశాలు చర్చించారు. ఎస్‌ఎల్బిసి ప్రాజెక్టు ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, ఏఎంఆర్పిలో ఐదో పంపు ఏర్పాటు చేసుకునే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తిగా అధ్యయనం చేసి గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్ ను పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం – ఏదుల కాలువలు గుర్తు చేసుకోవాలని ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఇరువురు మంత్రులు ఆదేశించారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న భూ సేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహణ, క్యాపిటల్ వర్కస్ పై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించుకోవడం, కాల్వలకు లైనింగ్ ద్వారా ప్రాజెక్టుల జీవితకాలం పెరుగుతుందని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. గత పదేళ్ల పాటు పరిపాలించిన వారు కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించి, రాష్ట్రంలో ఉన్న పాత ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని వివరించారు. పాత ప్రాజెక్టులను కాపాడుకునేందుకు మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూనే, కేంద్ర నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలను త్వరితగతిన పరిశీలించాలని మంత్రులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వలను బలోపేతం చేసుకునే పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. గత పదేళ్ల పాటు పరిపాలించిన వారు అడ్డగోలుగా ఎక్కువ వడ్డీ రేట్లుకు అప్పులు తేవడంతో ఆ భారం ప్రస్తుత ఖజానాపై పడుతోందని తెలిపారు. గత పాలకులు 10% వడ్డీ రేటుకు అప్పులు తేగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వడ్డీ రేట్లు 8 శాతానికి తగ్గించేందుకు అధికారులు మంచి ప్రయత్నం చేశారని మంత్రులు తెలిపారు.
గృహ జ్యోతి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఈ పథకం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ జనరల్ అనిల్, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, ఓ అండ్ ఎం ఈఎన్సీ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




