– ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే
– జాతీయ విపత్తుగా పరిగణించాలి
– హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రుల వినతి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాను కోరింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి గురువారం ఢిల్లీలో అమిత్ షా అధికారిక నివాసంలో కలసి పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆగస్టు 25–28 మధ్య తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉంది. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయి” అని మంత్రులు వివరించారు. అయితే, గత 72 గంటల్లో కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా సాధారణ జీవన విధానానికి అంతరాయం ఏర్పడిందని స్పష్టంచేశారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. అదేవిధంగా, వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి నష్టాలను అంచనా వేయాలని, కేంద్ర ప్రభుత్వ బృందాన్ని తెలంగాణకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మరణాలు సంభవించాయని, పాడి పశువుల మరణాలు, గృహ నష్టాలు, పంట నష్టాల గణన కొనసాగుతోందని మంత్రుల బృందం వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రోడ్లు, విద్యుత్, పంటలు, వివిధ శాఖలకు వాటిల్లిన మొత్తం నష్టం ₹5018.72 కోట్లుగా వారు పేర్కొన్నారు. గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రూ.11,713 కోట్ల సహాయం కోరినా, ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని. కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని, దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. అందువల్ల గతంలో కోరిన రూ.11,713 కోట్లతో పాటు తాజా అంచనా రూ.5,018 కోట్లు — మొత్తం రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది.ఈ విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సానుకూలంగా స్పందించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపి నష్టాలను అంచనా వేయిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డా. గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





