` పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు
` లోతట్టు ప్రాంతాలు జలమయం
` పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
` వెంకటాపురంనకు రాకపోకలు నిలిపివేత
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భద్రాచలం నుండి వెంకటాపురంనకు రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లివాగు, పొంగలవాగు పొంగి ప్రవహించడంతో వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో చర్ల వద్ద ఉన్న తాలిపేరు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. అలాగే వెంకటాపురం మండలం ఏకన్నగూడెం రాళ్ళవాగు వద్ద ఉధ్రుతంగా నీరు ప్రవహించడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. రాళ్ళవాగు వంతెనపై ద్విచక్రవాహనాలు, ఆటోలను మాత్రమే అనుమతిస్తున్నారు. భారీ వాహనాలను నిలిపివేసారు. ప్రజలు ఏటూరునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని అధికారులు సూచించారు. పినపాక మండలంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు ప్రవహించిన కారణంగా పెద్దవాగు ఉధ్రుతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసు కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులు ఇప్పటికే బాధితులకు తెలిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పినపాక, మణుగూరు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకగూడెం, ఈ బయ్యారం వద్ద ఉన్న పెద్దవాగు ఉధ్రుతంగా ప్రవహిస్తున్నది. పినపాక మండలంలో మారేడువాగు కూడా ఉధ్రుతంగా ప్రవహిస్తున్నది. మణుగూరు ప్రాంతంలో 19 సెం.మీ మేర వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. భద్రాచలం ఆర్‌డిఓ దామోదర్ జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు ఇండ్లలోకి చేరి బూర్గంపాడు మండలంలోని తాళ్లగొమ్మూరు, ఇరవెండి తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనేందుకు మణుగూరు పట్టణంలో ముందస్తు చర్యగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగు, మోట్ల వాగు, కట్లవాగు ఉధ్రుతంగా ప్రవహించడంతో అశోక్ నగర్, సుందరయ్య నగర్, వినాయకనగర్, గాంధీనగర్, కాళీమాత టెంపుల్ ఏరియా వంటి గ్రామాలు భారీగా వరద నీరు చేరి జలమయమయ్యాయి. మణుగూరు శివలింగాపురంలో రోడ్డుపైకి వర్షపునీరు చేరుకుని ఉదృతంగా ప్రవహిస్తుంది. సుందరయ్య నగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇల్లు ఖాళీ చేసి సురక్షమైన ప్రాంతాలకి తరలివెళ్లారు. గత ఏడాది అకస్మాత్తుగా అర్ధరాత్రి సమయంలో వరద నీరు సుందరయ్యనగర్, గాంధీనగర్, మణుగూరు పట్టణాన్ని చుట్టుముట ్టడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో ఈ ఏడాది కూడా ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.
వర్షాల వల్ల సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకి 3 టన్నుల బొగ్గుని వెలికి తీయవలసి ఉండడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. ఓసీలలో నిలిచిపోయిన నీటిని బయటికి తోడేందుకు మోటర్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సూచించారు. ఎస్టీ బాలికల హాస్టల్‌లోకి వరద నీరు చేయడంతో విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.





