– సొమ్ము చేసుకుంటున్న విమానయాన సంస్థలు
– ధరలపై గగ్గోలు పెడుతున్న ప్రయాణికులు
న్యూదిల్లీ, డిసెంబర్6 : దేశీయ విమానయాన రంగంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళం శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసుల రద్దు కావడంతో ఎదురైన పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికులను తీవ్రంగా దోచుకుంటున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ ధరల కంటే ఏకంగా 3 నుంచి 10 రెట్లు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి ఇది పెనుభారంగా మారింది. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం నాటి ధరలను పరిశీలిస్తే దిల్లీ – బెంగళూరు విమాన టికెట్ ధర రూ. 1,02,000గా నమోదు కాగా.. చెన్నై – దిల్లీ మార్గంలో టికెట్ ధర రూ. 90,000కు చేరింది. అదేవిధంగా దిల్లీ – ముంబైకి ఒక టికెట్ ధర ఏకంగా రూ. 54,222 పలికింది. ఇతర విమానయాన సంస్థల టికెట్ల ధరలు కూడా రూ. 20 వేల నుంచి రూ. 40 వేల మధ్యలో కొనసాగుతున్నాయి. ముంబై – శ్రీనగర్ మార్గంలో సాధారణంగా రూ. 10 వేల లోపు ఉండే టికెట్ ధర, ఇప్పుడు రూ. 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ తీసుకుంటే దాదాపు రూ. 92 వేల వరకు ఉంటోంది.దిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాలనుకునే వారికి కూడా అధిక ధరల సెగ తగిలింది. శనివారం నాటి ప్రయాణానికి దిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమాన టికెట్ ధర రూ. 33,000కు చేరుకుంది. సాధారణ రోజుల్లో ఈ మార్గంలో టికెట్ ధర కేవలం రూ. 5,000 నుంచి రూ. 7,000 మధ్య మాత్రమే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. డిసెంబర్ 7వ తేదీన దిల్లీ-చెన్నై ఎకానమీ క్లాస్‌లో కనీస టికెట్ ధర రూ. 53,000గా, దిల్లీ-హైదరాబాద్ కనీస ధర రూ. 25,000గా నమోదైంది. ఈ భారీ పెరుగుదల కారణంగా ప్రయాణాలు అత్యవసరం కాని వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు. విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ, ‘‘క్షమించండి.. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం’’ అని ప్రయాణికులకు సందేశం పంపింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ విమానాశ్రయాల్లోని ఇండిగో సిబ్బంది పట్ల దయతో మెలగాలని ప్రయాణికులను కోరారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. విమానం ఆలస్యమైతే కలిగే అసహనాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే ఆ కోపాన్ని సిబ్బందిపై చూపించడం సరికాదని సోనూ సూద్ హితవు పలికారు. ‘‘దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయగా, వినయంగా ఉండండి. విమానాల రద్దు భారాన్ని వారు కూడా మోస్తున్నారు. వారికి మనం మద్దతుగా నిలుద్దాం’’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇండిగో సమస్యల వల్ల తన కుటుంబ సభ్యులు కూడా ఎయిర్‌పోర్టులో దాదాపు 8 గంటల పాటు చిక్కుకుపోయారని సోనూ సూద్ వెల్లడించారు. ‘‘అక్కడ ప్రయాణికులు సిబ్బందిపై ప్రదర్శిస్తున్న కోపం, ఆగ్రహం చూసి చాలా బాధేసింది. వారిని తిడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఇది చాలా తప్పు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటర్ వద్ద నిల్చున్న ఉద్యోగి విమానం రద్దుకు లేదా ఆలస్యానికి కారణం కాదని గుర్తుచేశారు. ‘ఆ సిబ్బంది కూడా మనలాంటి ఉద్యోగులే. వారు కూడా గంటలతరబడి తిండి, నీళ్లు లేకుండా అందరి కోపాన్ని భరిస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా, చిరునవ్వుతో మాట్లాడండి. సహకరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి’ అని సూద్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఇండిగో.. దయచేసి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటూ సంస్థ యాజమాన్యాన్ని ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





