– మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు
– సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లు విడుదల చేశామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందని భట్టి తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మహిళలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. యేటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలుత పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని ప్రపంచంతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుందన్న నమ్మకతో ఉన్నామని తెలిపారు. గత పదేళ్లు పరిపాలించిన వారు స్వయం సహాయ సంఘాల సభ్యులను గాలికి వదిలేశారని, ప్రజా ప్రభుత్వం రాగానే వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. బలమైన కుటుంబ వ్యవస్థ కేవలం మహిళల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





