– రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా..
– స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవల లభ్యత
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి ఈ పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను తయారు చేశామన్నారు. ఈ పోర్టల్‌ను ఈనెల 2నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. వచ్చే ఫలితాలనుబట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోర్టల్‌ను రైతు కోణంలో రూపొందించామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గతంలో మాదిరి రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందేలా పోర్టల్‌ను రూపొందించామన్నారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చని చెప్పారు. రైతు లాగిన్ అయిన వెంటనే భూమి వివరాలు కనిపిస్తాయని, ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు ఫీజు ఎంత చెల్లించాలో కనిపిస్తుందని అన్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ లాగిన్‌కు వెళుతుందని, రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారని, తర్వాత ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సర్వేయర్ ఖరారు చేయడమేగాక రోవర్లతో సర్వే పూర్తి చేస్తారని ఆయన వివరించారు. దీనిని సిస్టమ్‌లో నమోదు చేశాక అది మండల సర్వేయర్ స్క్రూటినీకి వెళుతుందని, ఆపై తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారుకు ఎల్‌పిఎమ్, భూధార్ నెంబర్‌ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈ వివరాలు భూభారతి పోర్టల్‌లో కూడా నిక్షిప్తమవుతాయని, సర్వే తర్వాత సర్వే మ్యాప్‌ను జనరేట్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎమ్‌ఎస్ అలర్ట్స్ పంపిస్తారన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి క్రయవిక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని, ప్రతి సర్వే మ్యాప్ (ఎల్‌పిఎమ్) యూనిక్ నెంబరు, ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని వెల్లడించారు. ఐదు మండలాల్లో రైతులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సర్వే కోసం సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే త్వరితగతిన పూర్తవుతుందని, కచ్చితమైన వివరాలు వస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





