తొలి ద‌శ ఫ‌లితాలు కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం

– పాల‌నా వైఫ‌ల్య‌మే కార‌ణం
– పోటీ చేసిన పంచాయతీల్లో సగం కూడా గెల‌వ‌లేదు
– వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12: తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమ‌ని పేర్కొన్నారు. ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని  ఫలితాలతో రుజువైపోయింద‌న్నారు. రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి స్థానం లేదని కూడా ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయి. వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయ‌న్నారు. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేకచోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోంద‌న్నారు. రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రజలు మరిచిపోలేదని ఫలితాలు తేల్చిచెప్పాయి. యూరియా బస్తాల కోసం నెలలతరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయ‌న్నారు.  పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పడకేసిన పాలన, గాడి తప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డిజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయ‌న్నారు. ఇది ఆరంభం మాత్రమే.. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం తథ్యమ‌ని జోస్యం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *