దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం

కాల్పుల్లో సీపీఐ నేత మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. సీపీఐ హైదరాబాద్‌ సిటీ కమిటీ సభ్యుడైన చందు రాథోడ్‌పై మంగళవారం ఉదయం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శాలివాహననగర్‌లోని పార్కు వద్ద ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను అడ్డగించిన ప్రత్యర్థులు ముందుగా అతడి కళ్లలో కారం కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన చందు అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తాడు. అయితే ఆయనను వెంబడిరచి మరీ తుపాకితో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చందు రాథోడ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత దుండుగలు స్విఫ్ట్‌ కారులో పరారయ్యారు. హత్య సమయంలో ఐదుగురు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రాథోడ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నాగరకర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్‌ కుటుంబంతో చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దేవరుప్పలకు చెందిన సీపీఐ (ఎంఎల్‌) సభ్యుడు రాజేష్‌ అనే వ్యక్తితో చందు రాథోడ్‌కు వివాదం ఉందని బాధితుడి భార్య పోలీసులకు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *