నాంపల్లి ఫర్నీచర్‌ ‌షాపులో అగ్నిప్రమాదం

– తక్షణమే మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
– భారీగా పొగ, మంటలు చెలరేగడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్‌ ‌షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్‌ ‌భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్‌ ‌ఫర్నిచర్‌ ‌షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్‌ ‌సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు నుండి నలుగురు పిల్లలు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను, పక్కనే ఉన్న రెసిడెన్షియల్‌ ‌కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాలీ చేయించారు. మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైర్‌ ఇం‌జన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, భవనం ఇరుకైన సందులో ఉండటం, చుట్టూ సెట్‌బ్యాక్స్ ‌లేకపోవడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు పడలేదు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న భవనాల గోడలపైకి ఎక్కి ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం జరగడంతో నాంపల్లి నుంచి అబిడ్స్ ‌వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్‌ ‌పోలీసులు వెంటనే వాహనాల రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రాథమికంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగానే ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ఇరుకైన ప్రాంతాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక పంపండి: మంత్రి పొంగులేటి

ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాల్లోని వారిని ఖాళీ చేయాలని ఆదేశించారు. పోలీస్, ఫైర్ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న మంత్రి పొంగులేటి అదనపు ఫైర్ ఇంజిన్స్‌తో మంటలు అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. అంతేగాక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో మాట్లాడి ఘటనా స్థలానికి వెళ్లాలని, ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

నుమాయిష్‌కు రాకండి : సీపీ సజ్జన్నార్‌ ‌సూచన

నాంపల్లిలోని ఫర్నిచర్‌ ‌షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా  ఒకరోజు నాంపల్లి నుమాయిష్‌ సందర్శన‌ను వాయిదా వేసుకోవాలని హైదరాబాద్‌  ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనర్ ‌న‌గ‌ర‌వాసుల‌కు సూచించారు. అగ్నిప్రమాదం కారణంగా ఘటనా ప్రాంతంలో ట్రాఫిక్‌ ‌స్తంభించిందని, ట్రాఫిక్‌ ‌రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్‌ ‌పర్యటనను ఆదివారానికి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలో బచ్చా క్రిస్టల్‌ ‌ఫర్నిచర్‌ ‌దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం . ఫైరిరజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ ‌చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గ్రౌండ్ ‌ఫ్లోర్‌ ‌నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. జేసీబీలు, భారీ క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్‌ ‌తీవ్రంగా శ్రమించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *