సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని సనత్‌నగర్‌ సమతనగర్‌లోని డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌ గోదాములో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్‌ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్‌ ప్లేట్స్‌, డిన్నర్‌ సెట్స్‌ ప్యాకింగ్‌ వస్తువులు ఉండడంతో అవి దగ్ధమై భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రాణ నష్టం తప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్టు తెల్లవారుజామున 3.56 నిముషాలకు సమాచారం వచ్చిందని హైదరాబాద్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీదాస్‌ తెలిపారు. ఆ సమయంలో గోడౌన్‌లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని, డిన్నర్‌ సెట్స్‌, బౌల్స్‌, ప్లాస్టిక్‌ ప్లేట్స్‌కు సంబంధించిన వస్తువులు నిల్వ ఉంచుతున్నారని తెలిపారు. మాదాపూర్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, బాలానగర్‌ ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చాయన్నారు. ఫైర్‌ ఫైటింగ్‌ రోబోట్‌ను కూడా ఆపరేషన్‌కు వినియోగించినట్లు చెప్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని.. గోడౌన్‌లో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగిస్తున్నామని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో శ్రీదాస్‌ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *