ఆదాయం పెంపుపై దృష్టి సారించాలి

– ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య
– ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమీక్ష

నిజామాబాద్‌ జూలై 19 : స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ల్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆర్థిక సంఘం సభ్యులు ఎం.రమేష్‌, సంకెపల్లి సుధీర్‌రెడ్డిలతో కలిసి చైర్మన్‌ రాజయ్య శనివారం సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఆశిష్‌ సంగ్వాన్‌లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములను చేస్తూ వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్‌ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో సూచనలు చేస్తుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నాు. వీధి దీపాలకు సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీల్లో సోలార్‌ విద్యుత్‌ విధానాన్ని అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని చైర్మన్‌ సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్ధానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాజయ్య వెల్లడిరచారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, చందర్‌ రాథోడ్‌, నిజామాబాద్‌ ట్రైనీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, డీపీఓ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్లు, జెడ్పీ సీఈఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *