చిన్నారిపై అస‌భ్య దృశ్యాల చిత్రీకరణ‌

– వ‌రుస‌కు సోద‌రుడి అకృత్యం
– నిందితుడి అరెస్ట్
– టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: ఐదేళ్ల చిన్నారిపై అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఉదంతంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను నిరోధించే ‘టిప్‌లైన్’ ద్వారా అందిన సమాచారాన్ని బ్యూరోలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లోతుగా విశ్లేషించిందని తెలిపారు. సేకరించిన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా ఈ నేరం స్థానికంగానే జరిగిందని, బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదని గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. లోతైన దర్యాప్తు అనంతరం గోల్కొండ కుమ్మరివాడికి చెందిన మహమ్మద్ ఫహాద్ అలియాస్ ఆదిల్ (19) అనే డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని, 2026లో బ్యూరో విజయవంతంగా చిన్నారిని రక్షించిన రెండో కేసు అని వివరించారు. బాధితురాలు నిందితుడికి అత్యంత సమీప బంధువు అని, ఆ చిన్నారి అతడిని ఎంతో ఇష్టంగా భయ్యా అని పిలుస్తుండేదని డైరెక్టర్ తెలిపారు. ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని నిందితుడు తరచూ బాధితురాలి ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో బాలికను ఇంటిపైకి తీసుకెళ్లి అసభ్య దృశ్యాలను చిత్రీకరించేవాడని విచారణలో తేలిందని ఆమె పేర్కొన్నారు. నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపామని, అతనిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67-బితో పాటు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీసీపీఎస్ లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్పష్టం చేశారు. బాధితురాలికి అవసరమైన సహాయం అందజేయడంతోపాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించామని డైరెక్టర్ వివరించారు. పిల్లలపై జరిగే ఇలాంటి నేరాల్లో కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారని, ఇది సమాజంలో నమ్మకాన్ని వంచించడమేనని శిఖా గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఎవరి సంరక్షణలో ఉంచుతున్నామనే విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లల రక్షణ అనేది మన అందరి సామూహిక బాధ్యత అని, అధునాతన సాంకేతికతతో ఇలాంటి నేరాలను అరికట్టడానికి బ్యూరో నిరంతరం కృషి చేస్తోందని డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *