సృజనాత్మకతను పెంపొందించే చిత్రోత్సవాలు

-‘తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌‘ రెండోరోజు చిత్రోత్సవం ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 21: హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌’ రెండు రోజుల చిత్రోత్సవం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ చిత్రోత్సవాన్ని ప్రారంభించి త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్‌’ తొలి ప్రదర్శనను వీక్షించారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత ఫాదర్‌ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, యువశక్తి, మహిళా సాధికారత, ఐటీ, ఆరోగ్య రంగాల్లో విస్తృత భాగస్వామ్యానికి ఈ వేదిక తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈశాన్య భారత వైవిధ్యం, తెలంగాణ చైతన్యం కలిస్తే మరింత బలోపేతమైన జాతీయ ఐక్యత సాధ్యమవుతుందన్నారు. సినిమా సరిహద్దులు లేని భాష అని, అది ప్రాంతాలు, భాషలు, జాతులు దాటి మనుషులను ఏకం చేస్తుంది అని గవర్నర్‌ అన్నారు. డిజిటల్‌ మీడియా ద్వారా అడవి కొండల్లోని దూర గ్రామాల వరకు కూడా తెలుగు సినిమాలు చేరి విపరీతమైన ఆదరణ పొందుతున్నాయని, ఇది సినీ శక్తికి నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. త్రిపుర, మణిపూర్‌, అస్సాం తదితర రాష్ట్రాల కథలు, సంస్కృతి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందాలని అభిలషిస్తూ ఈ చిత్రోత్సవం ద్వారా సహ-నిర్మాణాలు, సాంకేతిక మార్పిడి, సృజనాత్మక ప్రయోగాలు పెరగాలని సూచించారు. హైదరాబాద్‌ సృజనాత్మకతకు కేంద్ర బిందువై ఎదుగుతున్న నేపధ్యంలో ఈ చిత్రోత్సవం రెండు ప్రాంతాల సినీ ప్రపంచాల మధ్య దీర్ఘకాలిక బంధాలకు పునాది వేస్తుందన్నారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ సీహెచ్‌.ప్రియాంక
ప్రతినిధులను, అతిథులను స్వాగతించి టీజీఎఫ్‌డీసీ లక్ష్యాలు, పరిధిని వివరించారు. ఈ చిత్రోత్సవం టెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌ కార్యక్రమంలో భాగమని, రెండు రోజులపాటు త్రిపుర, మణిపూర్‌, అస్సాం, మేఘాలయ, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే 12చిత్రాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. జాతీయ అవార్డులు పొందిన చిత్రాలతోపాటు, తెలంగాణ గ్రామీణ జీవనవిధానం, కళాశైలులు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రముఖ తెలుగు చిత్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రదర్శిస్తున్నామని వివరించారు. వాటిలో తారా (సిక్కిం-నేపాలీ), కుకీ (హిందీ), ఓనాతా (ఖాసీ-మేఘాలయ), ఈఖోయిగి యుమ్‌ (మణిపూర్‌), రేడార్‌ అండ్‌ పాఖి (అస్సాం) ప్రధాన ఆకర్షణలు. తెలంగాణ వైపు నుండి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన నా బంగారుతల్లి, పొట్టేల్‌, మల్లేశం, బలగం చిత్రాలు ప్రదర్శిస్తారు. కార్యక్రమములో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, టీజీఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాన కిషోర్‌, ఐఅండ్‌పీఆర్‌ డైరెక్టర్‌ కిషోర్‌బాబు, అదనపు డైరెక్టర్‌ డి.ఎస్‌.జగన్‌, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, దర్శకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *