సింగరేణిలో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ

– కార్మికుల సంక్ష్షేమానికి అత్యంత ప్రాధాన్యం
– 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాథ్‌ ల్యాబ్‌ ప్రారంభం
– అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 6: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ హాస్పిటల్స్‌లో పెండిరగ్‌లో ఉన్న వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది పోస్టులను మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో సింగరేణిపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 11మంది కాంట్రాక్టు వైద్యులు పనిచేస్తున్నారని, 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారా మెడికల్‌ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. రామగుండంలో క్యాథ్‌ల్యాబ్‌ నిర్మాణం పీపీపీ మోడల్‌లో చేపడుతున్నామని, కాంట్రాక్టు అవార్డు కూడా పూర్తయిందని తెలిపారు . 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి హాస్పిటల్స్‌లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సీపీఆర్‌ఎంఎస్‌ పథకం అందుబాటులో ఉన్నదని చెప్పారు. రిటైర్డ్‌ ఉద్యోగులు రూ.8 లక్షల వరకు మందులు తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తున్నామన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల ఇండ్ల నిర్మాణం కోసం స్థల కేటాయింపు అంశాన్ని బోర్డుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంది

సింగరేణి సంస్థని వేలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి మనుగడను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్‌ ఏజెన్సీలు రంగప్రవేశం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సింగరేణిని వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని బొగ్గు బావులను దక్కించుకునేలా చేశామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్‌ సంస్థలు తక్కువ ధరకే బొగ్గును సరఫరా చేస్తున్నాయని, వినియోగదారులు సహజంగానే తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని భట్టి వివరించారు. ఈ పరిస్థితి సింగరేణి బొగ్గు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నదన్నారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సంస్థ సీఎండీ, డైరెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిసూ రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ బీమా పథకాన్ని విద్యుత్‌ శాఖ డిస్కంల ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *