రిజర్వాయర్లు నింపాలి

– కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయాలంటూ మంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్‌లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని మిడ్‌ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్లను నింపేందుకు వాటి కింద సుమారు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెేజ్‌-6 వద్ద గల మోటార్లను ఆన్‌ చేసి నీటి పంపింగ్‌ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టేందుకు సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌లను ఆన్‌ చేయాలని రైతుల పక్షాన డిమాండ్‌ చేస్తున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 14 టీఎంసీల లభ్యత ఉన్నదని, కడెం నుండి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉందని, శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 45 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని హరీష్‌రావు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరిలో ఇన్‌ ఫ్లోస్‌ పెరిగిన విషయం తెలిసిందేనంటూ ఈ విషయం దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్‌-6 వద్ద గల నంది పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్‌ చేసి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్‌ చేశారు. లోయర్‌ మానేరు డ్యామ్‌ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి లభ్యత 7టీఎంసీలు ఉన్నదన్నారు. మిడ్‌ మానేరు నుండి లోయర్‌ మానేరుకు నీటిని నింపి ఎస్సారెస్పీ స్టేజ్‌-2 లోని అవసరమగు ఆయకట్టుకు ఖరీఫ్‌, రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల్లో ఆందోళనను తొలగించి రాజకీయలకతీతంగా వెంటనే నీటి పంపింగ్‌ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *