ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్క రిజల్ట్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ.1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా ఓవరాల్ బడ్జెట్‌లో దీని వాటా 8 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13%), బీహార్ (21%) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అని గొప్పలు చెప్పడం తప్ప విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు. ఆరోగ్య రంగం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగున ఉందని నిలదీశారు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం పెన్షన్లు, ఇతర బెనిఫిట్లను కూడా ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్‌కే అప్పగించడం అంటే ఆ సంస్థను కూడా దివాలా తీయించడమేనని విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ‘ఫ్యూచర్ సిటీ’ అని ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలతోపాటు, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ పథకాల వల్ల వచ్చినవేనని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ (ఆరఆరఆర్), దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఎండగట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వికసిత్ భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (గ్రామీణ) ((VBG RAMJI) చట్టం ద్వారా లబ్ధిదారులకు నేరుగా రూపాయికి రూపాయి అందుతుందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా కేంద్రం రూపాయి పంపిస్తే లబ్ధిదారులకు చేరేసరికి 15 పైసలు మాత్రమే మిగులుతున్నాయని అన్నారని గుర్తు చేస్తూ నేడు నరేంద్ర మోదీ పాలనలో ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పంపే ప్రతి పైసా నేరుగా పేదవాడి ఖాతాకే చేరుతోందన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని రామచందర్ రావు మండిపడ్డారు. ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, సరిగ్గా ఇవ్వకుండా.. ఇంకా ప్రతి రైతుకు ఇంకా సుమారు ఎకరాకు రూ.45,000కి పైగా బాకీపడి ఎగ్గొట్టారని విమర్శించారు. రూ.4000 నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఆర్థిక సాయం గురించి కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడా లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్‌లో చోటులేకపోవడం ప్రజలను వంచించడమేనన్నారు. కాంగ్రెస్ సర్కారు మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం రెండు రోజుల్లోనే రూ. 5000 కోట్ల నుండి రూ.7000 కోట్లకు ఎలా పెరిగిందని నిలదీశారు. ఇదంతా ఒక ప్లానింగ్ లేని విధానమని, కేవలం దోచుకోవడానికేనని ఆరోపించారు. దేవాలయాల విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతోందని రామచందర్ రావు విమర్శించారు. అర్చకుల వేతనాలు పెంచాలని, ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్ పెంచాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం మైనారిటీ బడ్జెట్‌ను రూ.700 కోట్లు పెంచడం ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేసి జీహెచఎంసీకి బడ్జెట్ కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పేదలకు దూరంగా ఉన్న ఈ ఫెయిల్డ్ బడ్జెట్‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *