ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతాం

వారి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేసిందని, తమ జీవితాలు దుర్భరంగా మారాయని, తమ సమస్యలను బీఆర్‌ఎస్‌ ముందుండి పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్‌రావును శుక్రవారం కలిసిన పటాన్‌చెరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆటో డ్రైవర్లు ఆర్థికంగా కుదేలవుతున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్‌ రెడ్డికి అలువాటుగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించింది బీఆర్‌ఎస్నేనన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని, చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన డిమాండ్‌ చేస్తున్నామని హరీష్‌రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *