గిరాయిపల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు యాభై ఏళ్లు!

“దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.”

సరిగ్గా యాభై సంవత్సరాల కింద, 1975 జూలై 25 రాత్రి అప్పటి మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవిలో పోలీసులు ఐదుగురు యువకులను చెట్లకు కట్టి అందులో నలుగురిని కాల్చి చంపారు. గిరాయిపల్లి హైదరాబాద్ – కరీంనగర్ రహదారికి కూతవేటు దూరంలో మాత్రమే ఉన్నా అది వార్త కాలేదు. అప్పుడు ఇప్పటిలాగా సంచలనాత్మక టెలివిజన్లు, సోషల్ మీడియా మాత్రమే కాదు,

పత్రికలు కూడా ఎక్కువ లేవు. ఉన్న పత్రికలు కూడా అప్పటికి ఒక నెల కింద మొదలయిన ఎమర్జెన్సీ సెన్సార్షిప్ కింద నలిగిపోతున్నాయి. అలా యువకులను చెట్లకు కట్టేసి కాల్చి చంపిన వార్త రాయడానికి, పోలీసులు చెప్పినట్టు ఎదురుకాల్పులూ, బాంబుదాడులూ జరిగాయో లేదో నిర్ధారించడానికి స్థానిక స్ట్రింగర్లూ లేరు, జిల్లా విలేఖరులు కూడా ఉన్నారో లేరో తెలియదు. హైదరాబాద్ లో పోలీసులు అధికారికంగా ఏమి చెపితే అది రాసుకోవలసిందే.

అందువల్ల శుక్రవారం రాత్రి హైదరాబాదుకు తొంబై కి.మీ. దూరంలో జరిగిన ఈ ఘటన మంగళ, బుధవారాల్లో గాని పత్రికల్లో రాలేదు. వచ్చినది కూడా హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం చెప్పినట్టుగా వచ్చింది. అప్పటికే “సిరిసినగండ్లలో ఒక హత్య చేసి, మరొక హత్యకు ప్రణాళిక రచిస్తున్న నక్సలైట్లు” ఉన్నారని తెలిసి పోలీసులు ఒక గుట్ట పక్కకు వెళ్లారని, పోలీసులు ఎంత హెచ్చరించినా వినకుండా నక్సలైట్లు కాల్పులు జరిపి, బాంబులు విసిరితే ఆత్మరక్షణార్థం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, కాసేపటికి అటునుంచి కాల్పులు ఆగిపోయి, వెళ్లి వెతికితే నాలుగు మృతదేహాలు కనబడ్డాయని వార్త. “రెండు పిస్టళ్లు, ఒక సబ్ మెషిన్ గన్, అయిదు బాకులు, ఒక సంచీ నిండా చేతిబాంబులు, సిపిఎం సాహిత్యం” దొరికాయని ఒక పత్రిక రాసింది. ఇతర పత్రికల వార్తల్లో చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి. ఆ వార్తలో ఆ యువకులు ఎవరో లేదు, మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారని లేదు. ఎమర్జెన్సీ గనుక అటువంటివి అడగడానికి కూడా వీలు లేదు.

ఆ నలుగురు యువకుల నాయకుడు సూరపనేని జనార్దన్, కృష్ణా జిల్లా గరికపర్రు నుంచి వచ్చి వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థిగా విప్లవోద్యమ నిర్మాణానికి మెదక్ జిల్లా వెళ్లాడు. మిగిలిన ముగ్గురూ వరంగల్ వాళ్లే. ముస్త్యాలపల్లికి చెందిన లంకా మురళీమోహన రెడ్డి వరంగల్ లాల్ బహదూర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. దేశాయిపేటకు చెందిన వనపర్తి సుధాకర్ హైస్కూలు చదువు తర్వాత వరంగల్ మార్కెట్ కమిటీలో ఉద్యోగం చేశాడు. బుధరావుపేటకు చెందిన కొలిశెట్టి ఆనందరావు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కొద్ది కాలం ఉద్యోగం చేశాడు.

దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.

“జస్టిస్ భార్గవా కమిషన్ నియామకం జరగగానే, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు ఒక విచిత్రమైన పని చేసి తిరుగులేని సాక్ష్యాధారాలను అందించారు. ఆయన జర్నలిస్టుగా తన విస్తృత సంబంధాలతో ఒక స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ తో తాగి ఉన్నప్పుడు ఈ ఎన్ కౌంటర్ గురించి వాస్తవాలన్నీ చెప్పించి రహస్యంగా రికార్డ్ చేసి, ఆ టేపులు న్యాయవాది కన్నబిరాన్ కు అందజేశారు. ఆ టేపులు జస్టిస్ భార్గవా కమిషన్ ముందు కీలక సాక్ష్యంగా ఉపయోగపడ్డాయి. ఆదిరాజు ఎమర్జెన్సీలో జరిగిన హత్యాకాండ గురించి ‘హంతకులెవరు?’ అనే పుస్తకం రాసి ఈ వివరాలన్నీ అందులో చేర్చారు. భార్గవా కమిషన్ విచారణ గురించి, ఒక్కొక్క సాక్షీ చెపుతున్న వాస్తవాల గురించీ అప్పటి పత్రికల్లో వివరంగా వెలువడుతుండడంతో, ఎన్ కౌంటర్ల బూటకత్వం సాధారణ ప్రజానీకానికి బహిర్గతమయింది.”

అది ఎమర్జెన్సీలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ కౌంటర్ పేరిట జరిగిన అనేకానేక హత్యలలో మొదటిది. ఆ ఘటనలో చనిపోయిన నలుగురూ 18-25 వయసు యువకులు. అందరికందరూ అప్పటికి రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణంతో సంబంధం ఉన్నవాళ్లు. వాళ్లు ఎమర్జెన్సీకి ఆరేడు నెలల ముందు మెదక్ జిల్లాలో రైతాంగ ఉద్యమ నిర్మాణానికి వెళ్లారు. ఎమర్జెన్సీ ప్రకటనకు నెల ముందు అక్కడ ఒక గ్రామంలో జరిగిన హత్య తర్వాత పెరిగిన నిఘాలో పోలీసులకు దొరికారు. వారిలో జనార్దన్ ను బహుశా సిద్ధిపేటలో పది రోజుల ముందు పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురినీ హైదరాబాదులో కొద్ది రోజుల ముందు పట్టుకున్నారు. అందరినీ ములుగు ఫారెస్ట్ డాక్ బంగ్లాలో రోజుల తరబడి అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. వారితో పాటు మరెందరినో కూడా అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేశారు. ఎమర్జెన్సీ విధించిన సరిగ్గా నెల రోజులకు ములుగు డాక్ బంగాళా నుంచి అయిదుగురిని అక్కడికి యాబై కి.మీ. లోపే ఉన్న గిరాయిపల్లి అడవికి తీసుకువెళ్లి చెట్లకు కట్టేశారు. ఆ అయిదుగురిలో నలుగురిని కాల్చి చంపేశారు. సాక్ష్యాధారాలు కూడా మిగలకుండా నాలుగు మృతదేహాలనూ దహనం చేశారు. ఎదురుకాల్పుల్లో మరణించారని పత్రికలకు వార్త విడుదల చేశారు.

అది ఎమర్జెన్సీ గనుక తర్వాత ఇరవై నెలల పాటు వాస్తవం బైటికి పొక్కనే లేదు. కాని ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువ ఆ ఘటనను దేశంలో చర్చనీయాంశంగా మార్చింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ చీకటిరాత్రి జరిగిన దురాగతాల గురించి చర్చ జరిగింది. ఉత్తరాదిలో షా కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఆ దురాగతాలను విచారించడం మొదలయింది. ఆ వేడిలోనే కేరళలోని కాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రాజన్ ను 1976 మార్చ్ 1న పోలీసులు పట్టుకుపోయారని, తర్వాత ఆయన జాడ తెలియలేదని బైటపడింది. తన కొడుకును పోలీసులు చంపేసి ఉంటారని అనుమానం ఉందని, తనకు న్యాయం చెయ్యమని రాజన్ తండ్రి ఈచర వారియర్ కేరళ హైకోర్టులో వేసిన పిటిషన్ దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. రాజన్ ను పోలీసులు హత్య చేశారని నిస్సందేహంగా తేలిపోయింది.

సరిగ్గా అట్లాగే, వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి జనార్దన్ ను, ముగ్గురు సహచరులను కూడా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో మృతులుగా చూపుతున్నారని, ఇది నిజమైన ఎదురుకాల్పుల ఘటనా కాదా తేల్చాలని ఆంధ్రప్రదేశ్ లో చర్చ ప్రారంభమయింది. ఒక్క గిరాయిపల్లి ఎన్ కౌంటర్ మాత్రమే కాక, మొత్తంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీలో 70 మందికి పైగా  ఎన్ కౌంటర్ పేరిట హత్య చేయబడ్డారని, ఆ ఘటనలన్నిటి మీద న్యాయవిచారణ జరపాలని డిమాండ్ ముందుకొచ్చింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి స్వతంత్ర న్యాయవిచారణ జరిపితే బాగుంటుందన్న జయప్రకాష్ నారాయణ్ బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, పియుసిఎల్ డిఆర్ అధ్యక్షుడు జస్టిస్ వి ఎం తార్కుండే నాయకత్వాన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ గిరాయిపల్లి ఘటన గురించి వాస్తవాల సేకరణతోనే తన విచారణ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీలో 77 మందిని బూటకపు ఎన్ కౌంటర్లలో చంపేశారని నిర్ధారించింది. తార్కుండే కమిటీ 1977 మే 16న విడుదల చేసిన మొదటి నివేదికలో ఎన్ కౌంటర్ కు ఎన్నోరోజుల ముందు నుంచే వాళ్లు పోలీసు నిర్బంధంలో ఉన్నారని, జూలై 25 రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని సాక్ష్యాధారాలు సేకరించింది.

“అనేకమంది కవులు రాసిన గీతాలలో, గద్దర్ రాసిన లాల్ సలాం లాల్ సలాం, వోలీ వోలీల రంగా వోలి పాటల్లో, ‘నక్సల్బరి బిడ్డలు’ ఒగ్గుకథలో గిరాయిపల్లి వీరులు మృత్యువును జయించారు. ఆ ఒక్క ఒగ్గుకథే ఆంధ్రప్రదేశ్ లో కనీసం వెయ్యి చోట్ల ప్రదర్శన జరిగి ఉంటుంది. జనార్దన్ మరణించిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలకు ఆయన సోదరుడు రాసిన ‘జనహృదయం జనార్దన్’ జీవితచరిత్ర గిరాయిపల్లి మృతవీరుల స్మృతిని శాశ్వతం చేసింది. అలా ప్రజా ఉద్యమకారుల మరణానంతర జీవితం ఎలా ఉంటుందో, వారు సజీవంగా ఉండిన కాలంలో చూపగలిగిన ప్రభావం కన్నా ఎన్ని రెట్ల ఎక్కువ ప్రభావాన్ని మరణానంతరం చూపగలరో గిరాయిపల్లి మృతవీరులు చూపారు. ఆ రకంగా గిరాయిపల్లి వీరులకు తెలుగు సామాజిక చరిత్రలో, తెలంగాణ సామాజిక చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉంది.”

జస్టిస్ తార్కుండే కమిటీ తన నివేదికను ప్రధాని మొరార్జీ దేశాయికీ, హోమ్ మంత్రి చరణ్ సింగ్ కూ సమర్పించి, ఆ ఇద్దరినీ ఎన్నోసార్లు కలుసుకుని చర్చించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కేంద్ర విచారణ జరిపించడం సాధ్యం అవుతుందా కాదా అని చర్చోపచర్చల తర్వాత, చివరికి కేంద్ర ప్రభుత్వం సూచించిన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వమే విచారణ జరిపించాలని అంగీకారం కుదిరింది. అలా జస్టిస్ వశిష్ట భార్గవ కమిషన్ ఏర్పడి బహిరంగ విచారణ కోసం 1977 జూలై 21న తొలి ప్రకటన ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భార్గవా కమిషన్ ఒక ఉజ్వల అనుభవం. ఆ కమిషన్ గిరాయిపల్లి ఎన్ కౌంటర్ నే తన మొదటి విచారణగా స్వీకరించింది. ఐదవ మనిషిగా చెట్టుకు కట్టెయ్యబడి మృత్యువును తప్పించుకున్న భిక్షపతి ప్రత్యక్ష సాక్షిగా, ఆ చెట్ల దగ్గరికి అంతకు ముందు తార్కుండే కమిటీనీ తీసుకువెళ్లాడు, తర్వాత జస్టిస్ భార్గవనూ తీసుకువెళ్లాడు. రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆ చెట్లకు తూటాల గుర్తులను ఇద్దరు న్యాయమూర్తులూ గుర్తించారు. అరెస్టుల గురించీ, ములుగు పోలీసు స్టేషన్ లో, ఫారెస్ట్ డాక్ బంగ్లాలో చిత్రహింసల గురించీ, చెట్లకు కట్టి కాల్చివెయ్యడం గురించీ, మృతదేహాలను దహనం చెయ్యడం గురించీ 25 మంది సాక్షులు అన్ని వివరాలూ వాస్తవాలూ కమిషన్ కు తెలియజేశారు.

జస్టిస్ భార్గవా కమిషన్ నియామకం జరగగానే, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు ఒక విచిత్రమైన పని చేసి తిరుగులేని సాక్ష్యాధారాలను అందించారు. ఆయన జర్నలిస్టుగా తన విస్తృత సంబంధాలతో ఒక స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ తో తాగి ఉన్నప్పుడు ఈ ఎన్ కౌంటర్ గురించి వాస్తవాలన్నీ చెప్పించి రహస్యంగా రికార్డ్ చేసి, ఆ టేపులు న్యాయవాది కన్నబిరాన్ కు అందజేశారు. ఆ టేపులు జస్టిస్ భార్గవా కమిషన్ ముందు కీలక సాక్ష్యంగా ఉపయోగపడ్డాయి. ఆదిరాజు ఎమర్జెన్సీలో జరిగిన హత్యాకాండ గురించి ‘హంతకులెవరు?’ అనే పుస్తకం రాసి ఈ వివరాలన్నీ అందులో చేర్చారు. భార్గవా కమిషన్ విచారణ గురించి, ఒక్కొక్క సాక్షీ చెపుతున్న వాస్తవాల గురించీ అప్పటి పత్రికల్లో వివరంగా వెలువడుతుండడంతో, ఎన్ కౌంటర్ల బూటకత్వం సాధారణ ప్రజానీకానికి బహిర్గతమయింది. దానితో పోలీసులు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గరికి వెళ్లి, విచారణ బహిరంగంగా జరిగితే తమ నైతిక స్థైర్యం దెబ్బతింటున్నదని మొర పెట్టుకున్నారు. విచారణ రహస్యంగా జరపాలని ముఖ్యమంత్రి భార్గవకు సూచించాడు. రహస్యంగా జరపడానికి నిరాకరించిన భార్గవ విచారణను అర్ధాంతరంగా ముగించారు. అప్పటికే పూర్తయిన గిరాయిపల్లి విచారణ నివేదికనైనా ఇమ్మని అడిగినా ఆయన నిరాకరించారు.

సరిగ్గా యాభై ఏళ్ల కిందటి ఈ ఘటనలకు చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణలో అప్పటికి ఐదు సంవత్సరాలకు పైగా బూటకపు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి గాని, గిరాయిపల్లి ఎన్ కౌంటర్ ఆ బూటకత్వాన్ని విస్పష్టంగా బహిరంగం చేసింది. పోలీసులు చెప్పే ఎన్ కౌంటర్ అంటే హత్యే అని అది శిలాక్షరాలలో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో, బహుశా దేశంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయవిచారణ జరిగి, అది అసలు ఎన్ కౌంటర్ కాదని, వారందరినీ చాలా ముందే పట్టుకుని, రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి, చెట్లకు కట్టి కాల్చి చంపారని నిస్సందేహంగా రుజువయిన ఏకైక ఘటన అది. అలా చంపేశామని ప్రభుత్వం భావించినవాళ్లు, ఆ తర్వాత మూడు సంవత్సరాలకు న్యాయవిచారణ క్రమంలో ప్రతి క్షణం పునర్జన్మించారు. పోలీసులు ఎన్ని కట్టుకథలు అల్లుతారో, నిజమైన విచారణ జరిగితే ఆ కట్టుకథలు ఎట్లా బైటపడతాయో, అప్పుడు పోలీసు యంత్రాంగం తమ “ఆత్మ స్థైర్యాన్ని” నిలబెట్టుకోవడానికి ఎటువంటి కుట్రలకు పాల్పడుతుందో, ఆ కుట్రలకు రాజకీయ నాయకత్వం ఎలా తల వంచుతుందో స్పష్టంగా చూపిన పరిణామం అది.

అనేకమంది కవులు రాసిన గీతాలలో, గద్దర్ రాసిన లాల్ సలాం లాల్ సలాం, వోలీ వోలీల రంగా వోలి పాటల్లో, ‘నక్సల్బరి బిడ్డలు’ ఒగ్గుకథలో గిరాయిపల్లి వీరులు మృత్యువును జయించారు. ఆ ఒక్క ఒగ్గుకథే ఆంధ్రప్రదేశ్ లో కనీసం వెయ్యి చోట్ల ప్రదర్శన జరిగి ఉంటుంది. జనార్దన్ మరణించిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలకు ఆయన సోదరుడు రాసిన ‘జనహృదయం జనార్దన్’ జీవితచరిత్ర  గిరాయిపల్లి మృతవీరుల స్మృతిని శాశ్వతం చేసింది. అలా ప్రజా ఉద్యమకారుల మరణానంతర జీవితం ఎలా ఉంటుందో, వారు సజీవంగా ఉండిన కాలంలో చూపగలిగిన ప్రభావం కన్నా ఎన్ని రెట్ల ఎక్కువ ప్రభావాన్ని మరణానంతరం చూపగలరో గిరాయిపల్లి మృతవీరులు చూపారు. ఆ రకంగా గిరాయిపల్లి వీరులకు తెలుగు సామాజిక చరిత్రలో, తెలంగాణ సామాజిక చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page