రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: మహిళా స్వయం సహాయక సంఘాలకు పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులను ఆర్థిక శాఖ సెర్ప్‌కు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు మంజూరయ్యాయి. శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ అవుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రమాద బీమా, రుణ బీమా చెక్కులు సైతం పంపిణీ చేయనున్నారు. బీఆర్‌ఎస్ సర్కారు వడ్డీ లేని రుణాలు రూ.3000 కోట్లకుపైగా బకాయిలు పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆ రుణాలను చెల్లించడంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి చోటుచేసుకుంది. మంత్రి సీతక్క చొరవతో మహిళా సాధికారతకు ఊతం లభించినట్లయింది.





