ఎరువులు

గ‌త‌వారం భార‌త్‌కు చెందిన మూడు ప్ర‌ముఖ ర‌సాయ‌న ఎరువుల క‌ర్మాగారాలు సౌదీ అరేబియాకు చెందిన ఒక సంస్థ‌తో డై అమోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) స‌ర‌ఫ‌రా కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అధికారిక స‌మాచారం ప్రకారం భార‌త్ మ‌న దేశీయ వినియోగావ‌స‌రాల్లో 84శాతం  ర‌సాయ‌న ఎరువుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  ఈ స‌మాచారాన్ని మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తే అస‌లు వాస్త‌వాలు తెలుస్తాయి. దేశంలో నెల‌కొన్న మొత్తం యూరియా డిమాండ్‌లో 77శాతం  మ‌న‌దేశంలోనే ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. ఇక ఎన్‌.పి.కె. (నైట్రోజ‌న్‌-ఫాస్ఫేట్‌-పొటాష్‌) ఎరువుల విష‌యానికి వొస్తే దేశీయ అవ‌స‌రాల్లో 84శాతం  మ‌న‌దేశంలోనే ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. దేశంలో యూరియా త‌ర్వాత అత్య‌ధిక డిమాండ్ ఉన్న  ఎరువు డీఏపీ. అయితే దీని ఉత్ప‌త్తిలో మాత్రం ఇంకా మ‌నం వెనుక‌బ‌డే ఉన్నామ‌ని చెప్పాలి. దేశీయంగా ఉన్న డిమాండ్‌లో 40శాతం   మాత్ర‌మే ఉత్ప‌త్తి చేయ‌గలుగుతున్నాం. అంకెల్లో చెప్పాలంలే వార్షికంగా 10 మిలియ‌న్ ట‌న్నుల డీఏపీకి డిమాండ్ కొన‌సాగుతోంది. పొటాష్ ఆధారిత పోష‌క ఎరువు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను మాత్రం నూటికి నూరుపాళ్లు మ‌న‌దేశం దిగుమ‌తిచేసుకుంటోంది.ఇది మొక్క పెరుగుద‌ల‌కు అత్యంత అవ‌స‌రం.

ప్ర‌పంచంలో ర‌సాయ‌న ఎరువుల వినియోగంలో చైనా మొద‌టిస్థానంలో ఉండ‌గా మ‌న‌దేశం రెండో స్థానాన్ని ఆక్ర‌మిస్తోంది. ప్ర‌స్తుతం అవ‌స‌రానికి అనుగుణంగా దేశంలో ర‌సాయ‌న ఎరువుల ఉత్ప‌త్తి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో, ఈ అంత‌రాన్ని భ‌ర్తీ చేసేందుకు ఇత‌ర దేశాల‌నుంచి మ‌న‌దేశం ఎరువుల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది.  ఇటీవ‌లికాలంలో మ‌న‌కు ర‌సాయ‌న ఎరువుల స‌ర‌ఫ‌రా విష‌యంలో ర‌ష్యా అత్యంత కీల‌కం గా మారింది. 2024-25 గ‌ణాంకాల ప్ర‌కారం రష్యానుంచి మ‌న‌దేశం 22.4శాతం  ఎరువులు దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.  త‌ర్వాతి స్థానాల‌ను సౌదీ అరేబియా, ఒమ‌న్‌, చైనా, మొరాకో దేశాలు వ‌రుసగా ఆక్ర‌మిస్తున్నాయి. దీనికితోడు ర‌సాయ‌న ఎరువుల ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకుల‌పై నూటికి నూరుశాతం విదేశాల‌పైనే ఇప్ప‌టికీ ఆధార‌ప‌డుతున్నాం. ప్ర‌స్తుతం మ‌న‌దేశం పొటాష్‌ను పూర్తిగా, 90శాతం రాక్ ఫాస్ఫేట్‌, పెద్ద‌మొత్తంలో స‌ల్ఫ‌ర్‌ను విదేశాల‌నుంచి దిగుమ‌తి చేసుకుంటోంది.

తాజాగా చైనా డీఏపీ మ‌రియు ఇత‌ర ఎరువుల ఎగుమ‌తుల‌పై కొన్ని ప‌రిమితులు విధించడంతో, ప్ర‌పంచ వ్యాప్తంగా చైనాపై ఆధార‌ప‌డుతున్న దేశాల్లో ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా ఎరువుల ధ‌ర‌లు బాగా పెర‌గ‌డం చైనా నిర్ణ‌యం వ‌ల్ల క‌లిగిన త‌క్ష‌ణ ప‌రిణామం. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ డీఏపీ ఎరువు కోసం ట‌న్నుకు 630 డాల‌ర్లు చెల్లిస్తుండ‌గా, ఇప్పుడ‌ది ఏకంగా 800 డాల‌ర్ల‌కు పెరిగింది. అయితే 2015-16లో మ‌నం మ‌న ఎరువుల అవ‌స‌రాల్లో 46శాతం  వ‌ర‌కు చైనాపైనే ఆధాప‌డేవాళ్లం. కానీ దీన్ని ప్ర‌స్తుతం మ‌న‌దేశం 10.5శాతం కు కుదించ‌గ‌లిగింది. భారత ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ్య‌వ‌సాయ‌రంగం వాటా 14శాతం కాగా 45శాతం  మంది శ్రామికుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న‌ది కూడా ఈ రంగ‌మే.  ఇక భార‌త ఎగుమ‌తుల్లో వ్య‌వ‌సాయ‌రంగం వాటా 12శాతం . ప‌రిశీలిస్తే వ్య‌వ‌సాయ‌రంగం స‌మృద్ధిగా ఉంటేనే దేశంలో ఆహార కొర‌త ఉండ‌దు. ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు ప‌రిమితిలోనే ఉంటాయి.

అదే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు ప‌డిపోతే ఆహార ధ‌ర‌లు పెర‌గ‌డం, ఇంధ‌న ద్ర‌వ్యోల్బ‌ణం, గ్రామీణ వినియోగం పెర‌గ‌డం వంటివి చోటుచేసుకుంటాయి. ఇది జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ర‌సాయ‌న ఎరువుల రంగాన్ని గ‌ట్టి నియంత్ర‌ణ‌లో ఉంచ‌క త‌ప్ప‌దు. ఇందుకోసం  ర‌సాయ‌న ఎరువుల ఉత్ప‌త్తి, ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రా, ఎరువుల క‌ర్మాగారాల లాభాల మార్జిన్‌ను కూడా ప్ర‌భుత్వమే నిర్ణ‌యిస్తోంది. ప్రస్తుతం ప్ర‌పంచంలోని భౌగోళిక‌-రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ త‌న ర‌సాయ‌న ఎరువుల అవ‌స‌రాల‌కోసం కేవ‌లం ఏఒక్క దేశంపైనో ఆధార‌ప‌డ‌కుండా, వివిధ దేశాలనుంచి దిగుమ‌తి చేసుకోవ‌డానికి య‌త్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ర‌సాయ‌న ఎరువులు మ‌రియు ముడి ప‌దార్థాల స‌ర‌ఫ‌రాల కోసం దీర్ఘ‌కాలిక ఒప్పందాల‌ను వివిధ దేశాల‌కు చెందిన కంపెనీల‌తో కుదుర్చుకుంటోంది. గ‌తవారం మ‌న‌దేశానికి చెందిన ఇండియ‌న్ పొటాష్ లిమిటెడ్‌, క్రిభ్‌కో, కోర‌మాండ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్  లిమిటెడ్ కంపెనీలు సౌదీ అరేబియా ప్ర‌భుత్వ ఆధీనంలోని మాదెన్ సంస్థ‌తో ఐదేళ్ల‌కు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేర‌కు సంస్థ 2025-26 నుంచి ఏటా 3.1మిలియ‌న్ ట‌న్నుల డీఏపీని మ‌న‌దేశానికి స‌ర‌ష‌రా చేస్తుంది. ఈ ఒప్పందం చైనానుంచి డీఏపీ దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని మ‌రింత‌గా త‌గ్గిస్తుంద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *