– ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వ అలసత్వం
– కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్
– రేవంత్ పాలనలో హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్
– జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి
– పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షలమంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి.. రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం.. సిగ్గుచేటు అని విమర్శించారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్‌స్థాయి బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తాము రూ.20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండిరగ్‌లో ఉంచిన రూ.3ు వేల కోట్లను కూడా చెల్లించామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు లేవన్న సాకుతో పెండిరగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
యూరియా కొరతకూ కాంగ్రెస్సే కారణం
రాష్ట్రంలో యూరియా కొరత, సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమన్నారు కేటీఆర్. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దోపిడీకి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇక నాయకులు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్, రోశయ్యలు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కేసీఆర్ కొనసాగించారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే కేసీఆర్ పేరు ఉందన్న ఏకైక కారణంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా వంటివి ఆపేసిందని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుతింటున్నారని మండిపడ్డారు. అప్పులు చేయకుండా ఆదాయం పెంచి పాలన చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని తెలంగాణలోని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారన్న కేటీఆర్.. గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవ్వాలన్నారు. తెలంగాణ దివాలా తీసింది.. ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉన్న మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్న కేటీఆర్.. తామంతా కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీవో 58, 59 కింద లక్ష మందికి కేసీఆర్ పట్టాలిచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలమంది ఇళ్లను కూలగొట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసినందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గోస పెడుతున్నందుకు, హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




