– ఆనాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట్లాడడం లేదు
– టిఆర్ ఎస్ పేరు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు
– జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్రŠ, ఏప్రిల్ 3: రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 39,640 పాఠశాలలు ఉండగా వీటిలో 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. సీబీఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటినుంచే వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్ప్పుడు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని రేవంత్ రెడ్డి పదేపదే మాట్లాడారని గుర్తు చేశారు. ఎవరెంత తిన్నారంటూ అసెంబ్లీలో చర్చ చేసుకున్నారే తప్ప ఫీజుల నియంత్రణపై మాట్లాడలేదని విమర్శించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులను పెంచుతున్నాయే తప్ప టీచర్లకు మాత్రం జీతాలు పెంచవని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లో ఆహార నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలు, హాస్పిటల్స్‌ను సీఎం ప్రారంభిస్తున్నారంటూ వాళ్ళ దోపిడీని ప్రోత్సహిస్తున్నారా అని నిలదీశారు. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్కూల్స్ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రా, ఉత్తర భారతం వాళ్ళు ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పినా తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. కాగా, పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తన పార్టీ గురించి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





